Begin typing your search above and press return to search.

పెద్ద బ్యానర్‌ లు కూడా ఇలా చేతులెత్తేస్తే ఎలా..!

By:  Tupaki Desk   |   2 July 2022 8:30 AM GMT
పెద్ద బ్యానర్‌ లు కూడా ఇలా చేతులెత్తేస్తే ఎలా..!
X
సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలతో పాటు ఎన్నో చిన్న సినిమాలు కూడా ప్రారంభం అవుతాయి. చిన్న సినిమాల్లో ఎక్కువ శాతం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటు ముక్కుతూ మూలుగుతూ కొన్ని పూర్తి అయితే కొన్ని మాత్రం మద్యలోనే నిలిచి పోతాయి. నిలిచి పోయిన సినిమాలు మళ్లీ పూర్తి అయ్యి.. విడుదల అవ్వడం అనేది చాలా తక్కువ సందర్బాల్లో జరుగుతుంది.

చిన్న సినిమాలు మద్యలో ఆగిపోయాయి అంటే అందుకు కారణం నిర్మాతలు ఆర్థికంగా అంతగా పెట్టలేక పోవడం. చిన్న నిర్మాతలు పెద్ద గా ప్లాన్‌ చేయడం వల్ల అలాంటి సమస్యలు వస్తాయి. ప్రకటించి వదిలేసిన సినిమాలు కూడా ఉంటాయి. అయితే కొన్ని సార్లు పెద్ద బ్యానర్‌ లు కూడా కొన్ని సినిమాలను ప్రకటించి.. షూటింగ్ ఒకటి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసి వదిలేసిన ప్రాజెక్ట్‌ కూడా ఉంటాయి.

పెద్ద బ్యానర్‌ లలో ప్రస్తుతం గీతా ఆర్ట్స్ మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ వదిలేసిన రెండు సినిమాల గురించి ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ రెండు బ్యానర్‌ లు కూడా రెండు చిన్న సినిమాలు.. అది కూడా రీమేక్‌ సినిమాలను అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ కూడా ప్రారంభించినట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆ రెండు సినిమాల జాడే ఇప్పుడు కనిపించడం లేదు.

ఆ రెండు రీమేక్ ల విషయానికి వస్తే రెండు కూడా మలయాళ సూపర్‌ హిట్‌ సినిమాలకు రీమేక్ లే. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ వారు చాలా తక్కువగా రీమేక్ లపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాంటి గీత బ్యానర్‌ వారు మలయాళ మూవీ నాయట్టు ను రీమేక్ చేసేందుకు పోటీ పడి మరీ రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశారు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమా అయిన దాన్ని రీమేక్ చేసే బాధ్యత లను పలాస దర్శకుడు అయిన కరుణ కుమార్‌ కు అప్పగించారు.

రీమేక్ కు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ చాలా ఎక్కువ రోజులే జరిగింది. షూటింగ్‌ కూడా ప్రారంభించారు.. ప్రారంభించబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు ఆ సినిమా తాలూకు అప్డేట్‌ లేదు. మరో వైపు సితారా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ వారు మలయాళ మల్టీస్టారర్ మూవీ కప్పేలా ను రీమేక్ చేసేందుకు ఫ్యాన్స్ రీటుకు రీమేక్‌ రైట్స్ ను కొనుగోలు చేశారనే వార్తలు ఆ మధ్య వచ్చాయి.

ఇద్దరు ముగ్గురు యంగ్ హీరోల వద్దకు రీమేక్‌ ప్రపోజల్‌ తీసుకు వెళ్లడం.. అందులో కొందరు నిరాకరించడం.. చివరకు ఇద్దరు యంగ్‌ హీరోలు ఓకే చెప్పడం షూటింగ్‌ ప్రారంభం అవ్వడం కూడా జరిగిందంటూ ప్రచారం జరిగింది. కాని ఇప్పుడు ఆ రీమేక్‌ కు సంబంధించి కూడా సితార వారు నోరు మెదపడం లేదు.

రెండు అద్భుతమైన సినిమాలు.. తెలుగు లో డబ్బింగ్‌ అయినా ప్రేక్షకులకు మంచి సినిమాలు చూసిన ఆనందం దక్కేది. కాని రీమేక్ పేరుతో డబ్బింగ్ చేయకుండా.. కనీసం డబ్బింగ్‌ వర్షన్ లను ఓటీటీ లో కూడా చూడకుండా చేశారు. పెద్ద బ్యానర్ లు అయినా ఇలా సినిమాలను ప్రకటించి పక్కన పెట్టడం ఏంటో అంటూ సినీ ప్రేమికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.