Begin typing your search above and press return to search.

ఈ శుక్ర‌వారమూ 'గోవింద' నామ స్మ‌ర‌ణే!

By:  Tupaki Desk   |   26 Aug 2018 1:30 AM GMT
ఈ శుక్ర‌వారమూ గోవింద నామ స్మ‌ర‌ణే!
X
శుక్ర‌వారం వ‌స్తోందంటే చాలు....టాలీవుడ్ లోని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు న‌టీన‌టుల‌కు టెన్షన్ మొద‌ల‌వుతుంది. త‌మ త‌మ సినిమాల రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో అని వారంతా కంగారు ప‌డుతుంటారు. అందులోనూ - త‌మ‌కు పోటీగా మ‌రో రెండు మూడు సినిమాలు అదేరోజు రిలీజ్ అయితే ఆ కాంపిటీష‌న్ లో ఏది హిట్టో ఏది ఫ‌ట్టో అని మ‌రో టెన్ష‌న్. అదే త‌ర‌హాలో ఈ శుక్ర‌వారం నాడు కూడా నాలుగు చిన్న సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర్ త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాయి. అయితే, ముందుగా ఊహించిన‌ట్లుగానే `గీత గోవిందం` దెబ్బ‌కు కొత్త సినిమాలు వెల‌వెల‌బోయాయి. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా విడుద‌లైనా నాలుగు సినిమాలు.....ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి. `గీత గోవిందం`కు పోటీ ఇవ్వ‌క‌పోగా....క‌నీసం ఓ మోస్త‌రు టాక్ కూడా తెచ్చుకోలేక‌పోవ‌డం విశేషం.

`గీత గోవిందం` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయి....100 కోట్ల క్ల‌బ్ వైపు ప‌రుగులు పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ శుక్రవారం రిలీజైన నాలుగు సినిమాల వ‌ల్ల గోవింద్ ఆ మార్క్ ను అందుకుంటాడో లేదో అని అంతా అనుకున్నారు. అయితే, ఆ నాలుగు సినిమాల్లో ఒక్క‌దానికీ పాజిటివ్ టాక్ రాలేదు. ఓపెనింగ్స్ కూడా అంతంత‌మాత్రంగానే ఉన్నాయి. వాస్త‌వానికి నిన్న విడుద‌లైన సినిమాల్లో ఆది పినిశెట్టి న‌టించిన `నీవెవ‌రో`పై కొద్దిగా అంచ‌నాలున్నాయి. కానీ, ఆది నిరాశ‌ప‌రిచాడు. మ‌రోవైపు - ‘ఆటగాళ్ళు’తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ నారా రోహిత్-జగపతిబాబుల `ఆట‌`సాగ‌లేదు. ఇక రష్మి గౌతమ్ ‘అంతకుమించి’ఆర‌బోసిన అందాలు అడ‌వి కాచిన వెన్నెల‌య్యాయి. అస‌లు, ప్రభుదేవా డబ్బింగ్ మూవీ ‘లక్ష్మి’ గురించి ప‌ట్టించుకునే నాథుడే లేడు. ఈ నాలుగు సినిమాలు నెగెటివ్ టాక్ తెచ్చుకోవ‌డంతో ‘గీత గోవిందం’ సెకండ్ వీకెండ్లోనూ హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకుపోతోంది. ఆగ‌స్టు 30న న‌ర్త‌న శాల‌ - 31న కోకో కోకిల వ‌చ్చేవ‌ర‌కు `గీత గోవిందం`కు అడ్డులేదు. మ‌రి, ఇదే ఊపులో గోవిందం 100 కోట్ల మార్కును అందుకుంటాడేమో వేచి చూడాలి.