Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: గీతతో గోవిందం రొమాన్స్

By:  Tupaki Desk   |   23 Jun 2018 7:36 AM GMT
ఫస్ట్ లుక్: గీతతో గోవిందం రొమాన్స్
X
పెళ్లి చూపులు మూవీతో హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డితో సూపర్బ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. కుర్రాళ్లలో ఇతడి సినిమాకు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది. మరి యూత్ ను ఎట్రాక్ట్ చేయాలంటే.. అందుకు చక్కని దారి లవ్ స్టోరీస్. ఈ విషయంలో ఎలాంటి లోటు చేయడం లేదు ఈ యంగ్ హీరో.

ఇప్పుడు గీత గోవిందం అంటూ కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. తొలి చూపుతోనే విపరీతంగా ఆకట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు. గోడకు కాళ్లు తన్నిపెట్టి హీరో నేలపై కూచుంటే.. అతడి కాళ్లపై కూచుని కబుర్లు చెబుతున్న హీరోయిన్ రష్మిక మందన మనకు కనిపిస్తుంది. ఆమె వైపు ప్రేమగా ఆరాధనగా చూస్తున్న విజయ్ దేవరకొండ లుక్ మరీ ఆకట్టుకుంటుంది. ఇక యూత్ ను మెప్పించేందుకు హీరోయిన్ గ్లామరసం కూడా బాగానే ధారపోసింది. ఫస్ట్ లుక్ తోనే ఈ మూవీలో రొమాన్స్ ఏ రేంజ్ లో ఉండనుందో దర్శకుడు పరశురాం చూచాయగా చెప్పేశాడు.

గీత గోవిందం మూవీపై ముందు నుంచి మంచి అంచనాలే ఉండగా.. ఇప్పుడు ఫస్ట్ లుక్ తర్వాత అవి రెట్టింపు కావడం ఖాయం. అంతగా అందరినీ మెప్పించే ప్రేమకథను విజయ్ దేవరకొండ-రష్మిక మందన అందించబోతున్నారని అనిపించక మానదు. క్రేజ్ ఉన్న మూవీలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయితే.. అంతకంటే ఆ సినిమాకు ఇంకే కావాలి?