Begin typing your search above and press return to search.

సోహైల్ తో పోటీప‌డుతున్న జెనీలియా భ‌ర్త‌

By:  Tupaki Desk   |   5 Feb 2022 2:30 AM GMT
సోహైల్ తో పోటీప‌డుతున్న జెనీలియా భ‌ర్త‌
X
బిగ్‌బాస్ సీజ‌న్ 4 ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్ రియాన్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న ప్ర‌యోగాత్మ‌క చిత్రం `మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌`. శ్రీ‌నివాస్ వింజ‌నం పాటి ఈ మూవీ ద్వారా దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మైక్ మూవీస్ బ్యాన‌ర్ పై అన్న‌పురెడ్డి అప్పిరెడ్డి, ర‌విరెడ్డి స‌జ్జ‌ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యి త్వ‌ర‌లో రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ చిత్రంలో హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సోహైల్ ప్రెగ్నెంట్ గా షాకింగ్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

ఇప్ప‌టికే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతున్న నేప‌థ్యంలో దీనికి పోటీగా బాలీవుడ్ లో మ‌రో చిత్రం తెర‌పైకి రాబోతోంది. రితేష్ దేశ్ ముఖ్‌, జెనీలియా ఇందులో జంట‌గా న‌టిస్తున్నారు. `మిస్ట‌ర్ మ‌మ్మీ` పేరుతో రూపొందుతున్న ఈ మూవీలో హీరో రితేష్ దేశ్ ముఖ్ ప్రెగ్నెంట్ గా క‌నిపించ‌బోన్నారు. టి సిరీస్ బ్యాన‌ర్ పై భూష‌ణ్‌ కుమార్ , క్రిష‌న్ కుమార్‌, షాద్ అలీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

హిలేరియ‌స్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీకి బంటీ ఔర్ బ‌బ్లీ, ఓకే జాను, సాతియా చిత్రాల ఫేమ్ షాద్ అలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దాదాపు ప‌దేళ్ల విరామం త‌రువాత రితేష్ దేశ్ ముఖ్‌, జెనీలియా క‌లిసి న‌టిస్తున్న చిత్ర‌మిది. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని శుక్ర‌వారం హీరో రితేష్ దేశ్ ముఖ్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా విడుద‌ల చేశారు.

`త్వ‌ర‌లో న‌వ్వుల‌కు స్వాగ‌తం ప‌లుకుతూ ఒక శుభ‌వార్త‌తో మీ త‌లుపు త‌ట్టేందుకు కామెడీ డ్రామా రాబోతోంది` అని ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తో పాటు ఆస‌క్తిక‌రంగా ట్వీట్ చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో ప్రెగ్నెంట్ కార‌ణంగా ప్యాంట్ టైట్ కావ‌డంతో ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టుగా చూపించారు. మ‌రో పోస్ట‌ర్ లో రితేష్ దేశ్ ముఖ్‌, జెనీలియా ప్రెగ్నెంట్ తో బెడ్ పై ప‌డుకుని క‌నిపిస్తున్నారు. పూర్తి స్థాయి కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ ఖ‌చ్చితంగా ప్రేక్ష‌కుల్ని న‌వ్వుల్లో ముంచేసేలా క‌నిపిస్తోంది.