Begin typing your search above and press return to search.

బాబాయ్ తప్పుకున్నాడు.. అబ్బాయి రావడం కన్ఫర్మ్‌

By:  Tupaki Desk   |   7 Feb 2022 5:21 AM GMT
బాబాయ్ తప్పుకున్నాడు.. అబ్బాయి రావడం కన్ఫర్మ్‌
X
కరోనా థర్డ్‌ వేవ్‌ కారణంగా డిసెంబర్ నుండి విడుదల అవ్వాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. డిసెంబర్‌ లో కొన్ని సినిమాలు విడుదల అయినా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. ఇక సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన పెద్ద సినిమాలు అన్ని కూడా వాయిదా పడ్డాయి. ఆ సినిమాల విడుదల తేదీలను ఇటీవలే క్లాష్ కాకుండా మాట్లాడుకుని మరీ నిర్ణయించుకున్నారు. అయితే కొన్ని సినిమాలకు రెండు విడుదల తేదీలను ప్రకటించడం జరిగింది. భీమ్లా నాయక్ సినిమా ను ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్‌ 1వ తారీకు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. భీమ్లా నాయక్‌ ప్రకటించడం వల్ల మరి కొన్ని సినిమాలు కూడా అలాగే ప్రకటించారు. ఫిబ్రవరి 25వ తారీకున భీమ్లా నాయక్‌ విడుదల కావడం లేదు అనే వార్తలు వస్తున్నాయి. ఏపీలో టికెట్ల రేట్ల వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు.. అందుకే చిత్రం బిజినెస్ పూర్తి కాలేదని సమాచారం అందుతోంది.

భీమ్లా నాయక్‌ సినిమా విడుదల ఏప్రిల్‌ 1న కన్ఫర్మ్‌ అన్నట్లుగా ఇటీవల నిర్మాత ఆఫ్‌ ది రికార్డు చెప్పుకొచ్చారు. దాంతో భీమ్లా నాయక్ స్థానంను వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమా తో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. వరుణ్ తేజ్ బాక్సర్‌ గా నటించిన ఈ సినిమా కు రెండు విడుదల తేదీలు నిర్ణయించారు. అందులో మొదటిది ఫిబ్రవరి 25 కాగా రెండవది మార్చి 4. ఈ రెండు తేదీల్లో ఫిబ్రవరి 25 కి గని ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. బాబాయి పవన్‌ కళ్యాణ్ తప్పుకోవడం వల్లే అబ్బాయి గని సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. ఒక వేళ భీమ్లా నాయక్‌ విడుదల వాయిదా పడకుండా ఉంటే మార్చి 4వ తారీకునే విడుదల చేసేవారు.

గని సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. కరోనా మూడు వేవ్ ల ప్రభావం చూసిన గని ఎట్టకేలకు పూర్తి అయ్యింది. ఇటీవలే సినిమా నుండి పాట కూడా విడుదల చేయడంతో సినిమా పై అంచనాలు పెంచారు. గని సినిమా లో ఉపేంద్ర మరియు సునీల్‌ శెట్టి వంటి స్టార్‌ నటులు కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్‌ నటించింది. వరుణ్‌ తేజ బాక్సింగ్ రింగ్‌ లో ప్రత్యర్థులను ఎలా మట్టి కరిపిస్తాడో అనే విషయాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఫిబ్రవరి 25వ తారీకు వరకు టికెట్ల రేట్ల విషయంలో క్లారిటీ రావడంతో పాటు ఏపీలో పూర్తిగా కర్ఫ్యూ ను ఎత్తి వేసే అవకాశం ఉంది. అంతే కాకుండా రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి సినిమా ఈ వారంలో విడుదల కాబోతుంది కనుక మెల్ల మెల్లగా ప్రేక్షకులు థియేటర్లకు మళ్లీ అలవాటు అవారు. తద్వారా గని సినిమా వరకు పరిస్థితులు నార్మల్‌ అవ్వడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే గని మేకర్స్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సినిమాకు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించగా అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు కలిసి నిర్మించారు.