Begin typing your search above and press return to search.

బరిలో నుంచి తప్పుకోనున్న మెగా హీరో..?

By:  Tupaki Desk   |   22 Nov 2021 2:30 PM GMT
బరిలో నుంచి తప్పుకోనున్న మెగా హీరో..?
X
డిసెంబర్ మొదటి వారం నుంచి పెద్ద హీరోల సినిమాలు.. పలు క్రేజీ మూవీస్ థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. 'పుష్ప' వంటి పాన్ ఇండియా మూవీతో పాటుగా 'అఖండ' 'శ్యామ్ సింగ రాయ్' 'గని' 'గుడ్ లక్ సఖీ' సినిమాలు ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలానే 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' 'మరక్కర్' వంటి డబ్బింగ్ సినిమాలు కూడా రాబోతున్నాయి. అయితే ఒకే రోజు రెండు క్రేజీ చిత్రాలను విడుదల చేయడం మంచిది కాదని భావించి.. 'గని' రిలీజ్ డేట్స్ ని రీ షెడ్యూల్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ - సిద్దు ముద్ద ఈ సినిమాని నిర్మించారు. అప్పుడెప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యమైంది. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ రెడీగా ఉండటంతో కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 17న అల్లు అర్జున్ 'పుష్ప' విడుదల ఉండటంతో.. ఒక వారం గ్యాప్ తో డిసెంబర్ 24న వరుణ్ తేజ్ సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఆ తేదీనే అధికారికంగా ప్రకటించారు.

కాకపోతే నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాని క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే అనౌన్స్ చేశారు. దీంతో రెండు చిత్రాలకు పోటీ తప్పదని అందరూ అనుకున్నారు. అయితే ఒకే రోజు సినిమాలు రిలీజ్ చేసే విషయంలో ఇరు వర్గాలు చర్చించుకున్నారని తెలుస్తోంది. నాని ముందే డిసెంబర్ 24ను లాక్ చేసి పెట్టుకోవడం.. అందులోనూ నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్న సినిమా కావడంతో వాయిదా వేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదట. 'గని' కూడా అదే డేట్ కోసం పట్టుబట్టినప్పటికీ.. ఇప్పుడు వెనక్కి తగ్గడానికి కాంప్రమైజ్ అయ్యారని టాక్ నడుస్తోంది.

'పుష్ప' సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే రెండో వారంలో కూడా గట్టి ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఒకవేళ అల్లు ప్రొడక్షన్ లో రూపొందుతున్న 'గని' అనుకున్న తేదీకి వస్తే మాత్రం బన్నీ సినిమాకు థియేటర్లు తగ్గొచ్చు. అందుకే వరుణ్ తేజ్ సినిమాను రేసు నుంచి తప్పించి.. వారం గ్యాప్ ఇచ్చి డిసెంబర్ నెలాఖరున విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. మరికొన్ని రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని టాక్.

ఇదే జరిగితే 'శ్యామ్ సింగ రాయ్' సినిమాతో పాటుగా 'పుష్ప' పార్ట్-1 కు కూడా బెనిఫిట్ అవుతుందని అనుకోవచ్చు. కాకపోతే 'గని' బాక్సాఫీస్ వసూళ్లకు వారం రోజులు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే జనవరి 7న మరో మెగా హీరో రామ్ చరణ్ భాగం అవుతున్న RRR రిలీజ్ అవుతోంది. మరి రాబోయే రోజుల్లో వరుణ్ తేజ్ సినిమా విడుదల విషయంలో ఏమి జరుగుతుందో చూడాలి.