Begin typing your search above and press return to search.

విషాద వేళ కృష్ణ ఫ్యాన్స్ కు ఘట్టమనేని ఫ్యామిలీ అభ్యర్థన

By:  Tupaki Desk   |   9 Jan 2022 4:36 AM GMT
విషాద వేళ కృష్ణ ఫ్యాన్స్ కు ఘట్టమనేని ఫ్యామిలీ అభ్యర్థన
X
ఊహించని విషాదం సూపర్ స్టార్ కృష్ణ కుటుంబాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. ఆయన పెద్ద కుమారుడు రమేశ్ బాబు అనూహ్యంగా కన్నుమూసిన వైనాన్ని ఇంకా ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన్ను.. శనివారం రాత్రి వేళ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూయటం.. ఆయన్ను అక్కడి మార్చురీలో ఉంచటం తెలిసిందే.

సొంత వాహనంలో ఆసుపత్రికి వెళుతున్న వేళ.. స్ట్రోక్ తో మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రమేశ్ బాబు అంత్యక్రియలకు సంబంధించిన కీలక అప్దేట్ ను ఘట్టమనేని కుటుంబం విడుదల చేసింది. ఆదివారం ఉదయం 6 గంటల వేళలో కుటుంబ సభ్యుల కోసం పద్మాలయ స్టూడియోలో రమేశ్ పార్థివ దేహాన్ని ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటల వేళలో మహాప్రస్థానంలో అంత్యక్రియల్ని నిర్వహిస్తారు.

రమేశ్ బాబు అంత్యక్రియల ఏర్పాట్లను కృష్ణ సోదరుడు ఘట్టమనేని అదిశేషగిరిరావు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా.. ఒమిక్రాన్ కేసుల కారణంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఎవరూ దహన సంస్కారాల స్థలంలో గుమ్మికూడవద్దని ఘట్టమనేని కుటుంబం కోరుతోంది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియల్ని నిర్వహించనున్నారు. రమేశ్ బాబు అకాల మరణాన్ని ఇండస్ట్రీ వర్గాలు.. క్రిష్ణ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

దీంతో.. రమేశ్ బాబును కడసారి చూసుకునే అవకాశాన్ని పరిమిత సంఖ్యలోనే ఇస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది.. కృష్ణను అమితంగా అభిమానించే అభిమానులకు ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పక తప్పదు. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగిలిన వారందరి క్షేమం కోసం ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు.. ఇప్పటికే కరోనా బారిన పడిన మహేశ్ బాబు ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఆయన తన సోదరుడ్ని కడసారి చూసేందుకు వస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.