Begin typing your search above and press return to search.

కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ రేంజ్ అదీ..

By:  Tupaki Desk   |   21 Sep 2015 9:30 AM GMT
కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ రేంజ్ అదీ..
X
కమల్ హాసన్ లాంటి లెజెండ్ ఓ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభకు ముగ్ధుడైపోయి.. వరుసగా నాలుగు సినిమాలకు అతడితోనే మ్యూజిక్ చేయించుకున్నాడంటే.. అంతకంటే సర్టిఫికెట్ ఇంకేం కావాలి చెప్పండి. జిబ్రాన్ ప్రతిభ గురించి ఇంకే మాటలు చెప్పాల్సిన పని లేదు. ‘వాగై సూడ వా’ అనే చిన్న సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు ఈ కుర్రాడు. ఆ సినిమాతో జాతీయ స్థాయిలో అతడి పేరు మార్మోగిపోయింది. లెక్కలేనన్ని అవార్డులు అతడి సొంతమయ్యాయి. అన్నిటికంటే పెద్ద అవార్డేంటంటే.. కమల్ హాసన్ అతడి ప్రతిభను గుర్తించడం. విశ్వరూపం-2 - ఉత్తమ విలన్ - పాపనాశం - తూంగావనం.. ఇలా వరుసగా అన్ని సినిమాలూ అతడికే కట్టబెట్టేశాడు.

తెలుగులో రన్ రాజా రన్ - జిల్ లాంటి మ్యూజికల్ హిట్స్.. తమిళంలో ఇంకో అరడజను దాకా సినిమాలు చేసి.. తన ప్రత్యేకత చాటుకున్నాడు జిబ్రాన్. ఈ యువ సంగీత దర్శకుడికి అరుదైన గౌరవం దక్కింది. తిరుచ్చిలోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. సౌండ్ డిజైన్ మీద వర్క్ షాప్ నిర్వహించడానికి జిబ్రాన్ ను ఆహ్వానించింది. దేశంలో - తమిళ పరిశ్రమలో ఎంతో మంది సంగీత దర్శకులుండగా.. ఓ ఎన్ఐటీ ‘సౌండ్ డిజైన్’ మీద వర్క్ షాప్ నిర్వహించే బాధ్యత జిబ్రాన్ కే అప్పగించిందంటే అతడి స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి వర్క్ షాప్ లను రెహమాన్ లాంటి ఉద్ధండులు మాత్రమే నిర్వహిస్తారు. జిబ్రాన్ ప్రతిభకు ఇది మరో నిదర్శనమని చెప్పాలి.