Begin typing your search above and press return to search.

మినీ రివ్యూ: 'జిన్నా'

By:  Tupaki Desk   |   22 Oct 2022 9:59 AM GMT
మినీ రివ్యూ: జిన్నా
X
చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ''జిన్నా''. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ మరియు సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. ఏవీఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై విష్ణు స్వీయ నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. కోన వెంకట్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి క‌థ‌ - స్క్రీన్ ప్లే అందించ‌డ‌మే కాకుండా క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌ గా వ్యవహరించారు.

భవిష్యత్తులో కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నానని చెబుతూ వచ్చిన మంచు విష్ణు.. 'జిన్నా' సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇది ఖచ్చితంగా తనకు అవసరమైన విజయాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో నిన్న శుక్రవారం ఈ సినిమా తెలుగు మలయాళ హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే.. రంగంపేట గ్రామంలో జిన్నా (విష్ణు మంచు) ఒక టెంట్ హౌస్ ను నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అతను ఊరంతా అప్పులు చేసి ఉంటాడు. అప్పుల బాధ నుంచి బయట పడేయడానికి సాక్షాత్తూ లక్ష్మీ దేవి రావాలని అనుకుండగా.. రేణుక (సన్నీ లియోన్) అనే ఒక అందమైన డబ్బున్న యువతి ఎంట్రీ ఇస్తుంది. మూగ అమ్మాయి అయిన రేణుక.. విడిపోయిన తన మామ (నరేష్) కోసం అమెరికా నుండి గ్రామానికి తిరిగి వస్తుంది. దీంతో జిన్నా మరియు అతని ప్రేయసి పచ్చళ్ళ స్వాతి (పాయల్ రాజ్‌పుత్) కలిసి రేణుక నుండి డబ్బు దొంగిలించడానికి.. అతని అప్పులు తీర్చుకోడానికి ఒక పథకం రచిస్తారు. ఈ క్రమంలో ఆమె రేణుక కాదు.. రూబీ అని తెలుసుకుంటాడు జిన్నా. అసలు రూబీ ఎవరు? ఎందుకు ఇండియాకి వచ్చింది? జిన్నా తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

'ఢీ' 'దేనికైనా రెడీ' వంటి కామెడీ చిత్రాలతో విజయాలు అందుకున్న మంచు విష్ణు.. మళ్ళీ అలాంటి ఫన్ క్యారక్టర్ తో వచ్చాడు. తన కామెడీ తో అందరినీ నవ్వించే ప్రయత్నం చేసాడు. డాన్స్ - ఫైట్స్ మంచి ఈజ్ తో చేసాడు. కేవలం తన పాత్రకే ప్రాధాన్యత ఉండాలని అనుకోకుండా.. ఇతర నటీనటులకు ఎక్కువ స్పేస్ కల్పించారు. సన్నీ లియోన్ మెడికల్ ప్రాబ్లమ్ ఉన్న గ్లామరస్ అమ్మాయిగా.. తన అందచందాలతో ఆకట్టుకుంది. పాయల్ రాజ్ పుత్ కూడా తన పాత్ర వరకు న్యాయం చేసింది. చమ్మక్ చంద్ర - వెన్నెల కిషోర్ - నరేష్ - సత్యం రాజేష్ తదితరులు ఎప్పటిలాగే తమ తమ పాత్రల్లో మెప్పించారు.

సన్నీలియోన్ సీన్స్ - సినిమాలో ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ మరియు ద్వితీయార్థంలో వచ్చే ట్విస్ట్ కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. దర్శకుడు సూర్య మొదటి ఫ్రేమ్ నుండి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఉపయోగపడ్డాయి. సినిమా చాలా వరకు పల్లెటూరి నేపథ్యంలో.. కొంత భాగం రిసార్ట్‌ లో జరిగినప్పటికీ, విజువల్స్ గ్రాండ్‌ గా ఉండేలా కెమెరామెన్ ఛోటా కె నాయుడు తన పనితనం చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

అయితే స్లో నేరేషన్ మరియు ప్రథమార్థంలో ల్యాగ్ సీన్స్ సినిమాకు ఇబ్బందిగా మారాయి. మొదటి నుండి పంచ్ డైలాగ్స్ - కామెడీ సన్నివేశాలు - ఫైట్స్ కు ప్రాధాన్యమిస్తూ కథను ముందుకు వెళ్లనీయలేదు. రొటీన్ అవుట్ డేటెడ్ కామెడీ.. సన్నివేశాలు ముందే ఊహించే విధంగా ఉండటం మైనస్ అని చెప్పాలి. కోన వెంకట్ 'గీతాంజలి' మాదిరిగానే తన రెగ్యులర్ ఫార్మాట్‌ లో స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఇక్కడ తేడా ఏమిటంటే, 'జిన్నా' లో ఎలాంటి ఆత్మ లేదా దెయ్యం లేదు.

కొన్ని కామెడీ సన్నివేశాలు పక్కన పెడితే, సినిమా కథనం అంతా రొటీన్ అని చెప్పాలి. డైలాగ్స్‌ లో కూడా కొత్తదనం లేదు. ఎడిటింగ్ కూడా ఇంకాస్త బెటర్ గా చేసే అవకాశం ఉంది. మొత్తం మీద 'జిన్నా' ఒక అవుట్ డేటెడ్ సినిమా అనిపించుకుంది.

ఈసారైనా హిట్టు కొడతాడు అని అందరూ భావించారు కానీ.. పని అయ్యేలా లేదు. కాకపోతే విష్ణు మంచు గత చిత్రాలతో పోల్చుకుంటే కాస్త బెటర్ అని చెప్పాలి. ఇంతకుముందు కంటే మెరుగైన నటన కనబరిచాడు. ఫైట్స్ - డాన్స్ - కామెడీ తో పాటుగా యాక్షన్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. మరి బాక్సాఫీస్ వద్ద ''జిన్నా'' ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.