Begin typing your search above and press return to search.

'ఆచార్య' దెబ్బతోనే 'గాడ్ ఫాదర్' అలాంటి నిర్ణయం తీసుకున్నాడా..?

By:  Tupaki Desk   |   16 Sep 2022 1:30 AM GMT
ఆచార్య దెబ్బతోనే గాడ్ ఫాదర్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడా..?
X
మెగాస్టార్ చిరంజీవి నటించిన ''గాడ్ ఫాదర్'' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే విడుదలకు కేవలం రెండు వారాల సమయమే ఉన్నా.. ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో బజ్ లేదు.

చిరు తో పాటుగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరియు లేడీ సూపర్ స్టార్ నయనతార వంటి స్టార్స్ ఉన్నా.. పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. ఇప్పటి వరకు వచ్చిన టీజర్ మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించలేకపోయింది. దీంతో మేకర్స్ ఇంకా థియేట్రికల్ డీల్స్‌ ను క్లోజ్ చేయలేకపోయారనే టాక్ వచ్చింది.

సాధారణంగా పెద్ద సినిమాల బిజినెస్ రిలీజ్ కు కొన్ని నెలల ముందే జరిగిపోతుంది. కాంబినేషన్ - క్రేజ్ ను బట్టి మంచి రేట్లకు అమ్ముతుంటారు. కానీ మెగాస్టార్ నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా డీల్స్ క్లోజ్ అవ్వకపోవడం ఏంటని అందరూ ఆశ్చర్య పోయారు. దీనికి 'ఆచార్య' ఫలితం కారణం అయ్యుండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

చిరంజీవి చివరి సినిమా 'ఆచార్య' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో బయ్యర్లు భారీగా నష్టపోయారు. అందుకే ఇప్పుడు 'గాడ్ ఫాదర్' విషయంలో డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరని కామెంట్స్ వినిపించాయి.

రికవరీ ప్రాతిపదికన సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఓకే అంటున్నారు కానీ.. నాన్ రిఫండబుల్ డీల్స్ వద్దంటున్నారని ఊహాగానాలు వచ్చాయి. అయితే వాస్తవానికి చిరంజీవి నిర్ణయం మేరకే ఈ చిత్రాన్ని అమ్మలేదని.. ఇప్పుడు నిర్మాతలు ఓన్ రిలీజ్ చేస్తున్నారని ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

'గాడ్ ఫాదర్' సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్బీ చౌదరి - ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ చిత్రాన్ని భారీ రేట్లకు అమ్మవద్దని.. అడ్వాన్స్ ల మీద మాత్రమే విడుదల చేయమని చిరంజీవి నిర్మాతలకు సూచించారట. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లోనూ అలానే రిలీజ్ చేయాలని చెప్పారట.

మామూలుగా ఎవరైనా సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండి.. గట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ వుంటే.. సొంతంగా రిలీజ్ చేసుకుంటుంటారు. దాదాపు అందరూ తమ సినిమాలను అమ్మేయాలనే అనుకుంటారు.. అన్ని కోట్ల బడ్జెట్ తో రిస్క్ తీసుకోడానికి నిర్మాతలు పెద్దగా సాహసించరు. కానీ ఇప్పుడు 'గాడ్ ఫాదర్' సినిమాను అడ్వాన్స్ ల మీద విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

అయితే దీని వెనుక 'ఆచార్య' ప్రభావం ఉందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్ని ఏరియాలలో భారీ రేట్లకు విక్రయించారు. కానీ ఘోర పరాజయం చెందడంతో బయ్యర్లంతా భారీ నష్టాలను చూడాల్సి వచ్చింది. నష్ట పరిహారం కోసం దర్శకుడి ఆఫీస్ మెట్లు ఎక్కడం ఆ మధ్య చర్చనీయాంశమైంది.

అందుకే ఈసారి 'గాడ్ ఫాదర్' విషయంలో ఇలాంటివేమీ లేకుండా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి నేరుగా అడ్వాన్సుల మీద విడుదల చేయాలని డెసిజన్ తీసుకున్నారని టాక్ నడుస్తోంది.

'గాడ్ ఫాదర్' చిత్రాన్ని తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఇది మలయాళంలో మంచి విజయం సాధించిన 'లూసిఫర్' సినిమాకు అధికారిక రీమేక్. దసరా సీజన్‌ లో విడుదల కాబట్టి ఈ సినిమాకు ప్రయోజనం ఉంటుంది. కాకపోతే ఇప్పటి నుంచైనా దూకుడు ప్రమోషన్లు చేసి సినిమాపై తగినంత బజ్‌ ని క్రియేట్ చేయాల్సిన అవసరముంది. మరి రాబోయే రోజుల్లో ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.