Begin typing your search above and press return to search.

బాలయ్యతో కలిసి కనిపించడమే అదృష్టం: ప్రగ్యా జైస్వాల్

By:  Tupaki Desk   |   10 Dec 2021 6:38 AM GMT
బాలయ్యతో కలిసి కనిపించడమే అదృష్టం: ప్రగ్యా జైస్వాల్
X
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన 'అఖండ' .. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో బాలయ్య .. బోయపాటిలకు హ్యాట్రిక్ హిట్ పడుతుందా .. లేదా? అనే సందేహాలకు మొదటి రోజునే తెరపడిపోయింది. ఈ సినిమాకి ముందు థియేటర్ల దగ్గర పెద్దగా సందడి చేసిన సినిమాలు లేవు. మరో వైపున కొత్త వేరియంట్ గురించిన వార్తలు రోజు రోజుకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లకు ఎంతవరకూ జనాలు వస్తారనే డౌట్ ఉండిపోయింది. కానీ ఒక్కసారిగా థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక గతంలో సింగిల్ థియేటర్లు మాత్రమే ఉన్నప్పుడు. టౌన్లలో ఎక్కువగా హీరోల భారీ కటౌట్ లు కనిపించేవి. అభిమానులు తమ హీరోల కటౌట్ ల దగ్గర కొబ్బరి కాయలు కొట్టడం .. హారతులు పట్టడం జరిగేది. మళ్లీ అలాంటి వాతావరణం ఈ సినిమాకి కనిపించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకూ వసూళ్ల సందడి కనిపిస్తోంది. తన సినిమాల్లో ఎప్పుడూ మాస్ కంటెంట్ కి ప్రాధాన్యతనిచ్చే బోయపాటి, ఈ సారి యాక్షన్ కి ఆధ్యాత్మికతను జోడించడం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. ఈ అంశమే ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించింది.

బాలకృష్ణ సరసన సీనియర్ హీరోయిన్ దొరకడం ఈ మధ్య కాలంలో కష్టమే అవుతోంది. గతంలో కొంతమంది కథానాయికలను ఆయన సరసన చూసినప్పుడు ఆయనకి కరెక్ట్ జోడీ కాదేమోననిపించింది. కానీ ఈ సారి ప్రగ్యా జైస్వాల్ ఎంపిక కరెక్ట్ గా కుదిరింది. నాయిక పాత్రలో ఆమె చాలా నిండుగా .. హుందాగా కనిపించింది. పోస్టర్లు బయటికి వచ్చినప్పుడే ఈ జంట చాలా బాగుందని అంతా అనుకున్నారు. సినిమా చూసిన తరువాత కూడా వాళ్లలో ఆ అభిప్రాయం అలాగే ఉండిపోయింది. నిన్న రాత్రి వైజాగ్ లో జరిగిన గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ లో ప్రగ్యా జైస్వాల్ మాట్లాడింది.

"ఈ రోజున నాకు చాలా చాలా చాలా సంతోషంగా ఉంది. 'అఖండ' సినిమాకి మీ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను కూడా ఒక భాగం కావడం నా అదృష్టం. ఈ సినిమాలో శరణ్య పాత్రలో నా నటనను అభినందిస్తున్న వారందరికీ కూడా నేను థ్యాంక్స్ చెబుతున్నాను. నాకు ఈ పాత్రను ఇచ్చిన బోయపాటిగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాలకృష్ణగారితో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సెట్స్ లో ఆయన ఎంతో ఎనర్జీతో కనిపించేవారు .. ప్రతి రోజు ఆయన నుంచి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం లభించింది. నాతో పాటు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్" అంటూ చెప్పుకొచ్చారు.