Begin typing your search above and press return to search.

అంటే.. సుందరానికి ఎక్కడ తేడా కొట్టిందబ్బా..??

By:  Tupaki Desk   |   12 Jun 2022 3:30 AM GMT
అంటే.. సుందరానికి ఎక్కడ తేడా కొట్టిందబ్బా..??
X
నేచురల్ స్టార్ నాని సాలిడ్ సక్సెస్ అందుకొని చాలా కాలం అవుతోంది. డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేసిన 'టక్ జగదీష్' 'వి' చిత్రాలతో నిరాశ పరిచిన నాని.. చివరగా 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో పర్వాలేదనిపించాడు. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాల్సింది. కానీ అప్పుడు నాని చుట్టూ ఏర్పడిన వివాదాలు పరోక్షంగా అతని సినిమాపై దెబ్బేసాయనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో విజయమే పరమావధిగా ఇప్పుడు ''అంటే సుందరానికీ'' అనే రోమ్ కామ్ తో వచ్చాడు.

నాని మరియు నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అంటే సుందరానికి'. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమాని శుక్రవారం థియేటర్లలోకి తీసుకొచ్చారు. తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ డే రూ. 3.87 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల కాలంలో నాని సినిమాలలో ఇదే లీస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న మూవీ. తక్కువ టిక్కెట్ రేట్లు ఉన్నప్పుడు రిలీజ్ చేయబడిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా కూడా తొలి రోజు 4.17 కోట్లు రాబట్టగలిగింది. ఈ మధ్య వచ్చిన అడివి శేష్ 'మేజర్' (4.1 కోట్లు) మూవీ కూడా 'అంటే సుందరానికి' కంటే ఎక్కువ కలెక్ట్ చేయడం గమనార్హం.

నిజానికి విడుదలకు ముందు నాని చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అంటే..' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా రావడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. తొలి రోజు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. పవన్ కళ్యాణ్ మరియు ఆయన అభిమానుల సపోర్ట్ ఎలాగూ ఉంది. అయినప్పటికీ ఈ మూవీ మంచి ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది.

అదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సపోర్ట్ తో వచ్చిన 'మేజర్' సినిమా అడివి శేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టింది. ఇది పవన్ కళ్యాణ్ పై నెగిటివిటీ అని కాదు కానీ.. ఆయన మద్దతుగా నిలిచిన నాని సినిమాకు తక్కువ వసూళ్ళు రావడంతో ఫిల్మ్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకముందు పవన్ 'రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా కూడా పరాజయం పాలైంది. ఇప్పుడు 'అంటే..' ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

'అంటే సుందరానికి' చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్లు బిజినెస్ చేసింది. ఫలితంగా రూ. 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ మార్క్ అందుకోవాలంటే.. బాక్సాఫీస్ వద్ద గట్టిగా నిలబడాలి. కాకపోతే 'మేజర్' 'విక్రమ్' సినిమాలు రెండో వారంలో ప్రభావం చూపిస్తున్నాయి. మరి వీటి పోటీని తట్టుకొని నాని మూవీ ఎలా నిలబడుతుందో చూడాలి.