Begin typing your search above and press return to search.

ఇలాటి క్యారెక్టర్లు చూసి ఎన్నేళ్లయిందో..

By:  Tupaki Desk   |   26 Nov 2016 10:32 AM GMT
ఇలాటి క్యారెక్టర్లు చూసి ఎన్నేళ్లయిందో..
X
తెలుగు సినిమాలంటే చాలా వరకు హీరో హీరోయిన్లు.. విలన్ల చుట్టూనే తిరుగుతాయి. అందులోనూ హీరో మీద ఉన్నంత ఫోకస్.. హీరోయిన్ మీద.. విలన్ మీద ఉండదు. ఇక మిగతా పాత్రల సంగతైతే సరేసరి. సహాయ పాత్రలకు కూడా ఒక ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ ఉండటం.. వాటికీ కథలో ప్రాధాన్యం ఉండటం.. వాటి ద్వారా కూడా కథను ముందుకు నడిపించడం.. అన్నది అరుదుగా కనిపిస్తుంటుంది తెలుగు సినిమాల్లో. ఈ శుక్రవారం రిలీజైన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అలాంటి అరుదైన సినిమానే. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల క్యారెక్టర్లను మాత్రమే కాదు.. సహాయ పాత్రలనూ చక్కగా మలిచాడు దర్శకుడు. ఒకప్పుడు వంశీ సినిమాల్లో మాదిరి.. జీవం ఉన్న.. నేటివిటీ ఉన్న.. ప్రత్యేకమైన క్యారెక్టర్లతో సినిమాకు ఒక కళ తెచ్చాడు కొత్త దర్శకుడు శివరాజ్ కనుమూరి.

తన అధికారాన్ని ఉపయోగించుకుని.. అమ్మాయిల మోజు తీర్చుకునే కన్నింగ్ జాయింట్ కలెక్టర్ పాత్రలో రవివర్మ.. ఎదుటి వాడు సంతోషంగా ఉంటే భరించలేక ఏదో ఒక మంట పెట్టే అధికారి పాత్రలో కృష్ణభగవాన్.. గవర్నమెంట్ ఆఫీసు ముందు కమిషన్ తీసుకుని పనులు చేసి పెట్టే తత్కాల్ పాత్రలో ప్రవీణ్.. లంచం ఇవ్వకుండా ప్రభుత్వంతో పని చేయించుకోవాలని పట్టుదలతో నెలలు నెలలు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగే సామాన్యుడి పాత్రలో పోసాని కృష్ణమురళి.. ఇలా మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని పోలిన సహజత్వంతో కూడిన.. జీవం ఉన్న పాత్రల్ని తెరమీద చూస్తుంటే మంచి ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. కామెడీ అంటే ఊరికే హడావుడి చేయడం.. పంచ్ డైలాగులు వేయడం అన్నట్లు తయారైన ఈ రోజుల్లో ఇలాంటి సహజమైన పాత్రలతో.. సందర్భోచితమైన సంభాషణలతో చక్కటి వినోదం పంచాడు రైటర్ కమ్ డైరెక్టర్ శివరాజ్. సందర్భానుసారంగా కథ కోసం ఈ పాత్రల్ని ఉపయోగించుకున్న తీరు ఆకట్టుకుంటుంది. సినిమా నుంచి బయటికి వచ్చాక చాలా వరకు హీరో హీరోయిన్లు విలన్ మాత్రమే గుర్తుంటారు. కానీ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ చూసి వచ్చాక చాలా పాత్రలు మన వెంట వస్తాయి. అదీ ఈ సినిమా ప్రత్యేకత. తెలుగులో ఇలాంటి లైఫ్ ఉన్న క్యారెక్టర్లతో కూడిన మంచి సినిమాలు రావడం అరుదు.

-- శివ