Begin typing your search above and press return to search.

మూడు సినిమాలు... మూడు రకాలు

By:  Tupaki Desk   |   3 Aug 2018 5:10 AM GMT
మూడు సినిమాలు... మూడు రకాలు
X
వేసవి సినిమాల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ డల్లయిపోయింది. గత రెండు నెలల్లో బాక్సాఫీస్ కు కొంచెం ఊపు ఇచ్చిన ఏకైక సినిమా ‘ఆర్ ఎక్స్ 100’ మాత్రమే. మిగతా సినిమాల్లో చాలా వరకు తీవ్ర నిరాశకు గురి చేశాయి. కొన్ని సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి. ఐతే జూన్-జులై నెలల్లో స్కూళ్లు.. కాలేజీల హడావుడి ఉంటుంది కాబట్టి ఎప్పుడూ బాక్సాఫీస్ కొంచెం డల్లుగానే ఉంటుంది. ఆగస్టులో మళ్లీ సందడి కనిపిస్తూ ఉంటుంది. ఊపు వస్తుంది. ఈసారి కూడా అదే జరుగుతుందని టాలీవుడ్ ఆశిస్తోంది. ఆగస్టు తొలి వీకెండ్లో రాబోతున్న మూడు సినిమాలపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మూడు సినిమాలు వేటికవే వైవిధ్యమైనవి కావడం విశేషం.

ముందుగా అడివి శేష్ సినిమా ‘గూఢచారి’ విషయానికి వస్తే.. అదొక స్పై థ్రిల్లర్. ‘క్షణం’తో తనేంటో రుజువు చేసుకున్న శేష్.. ఈసారి మరింత పెద్ద స్థాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తెలుగు సినిమాల్లో చాలా అరుదైన జానర్ ను అతనెంచుకున్నాడు. ఈ చిత్రంతో శశికిరణ్ తిక్కా అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్ర ప్రోమోలు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాయి. పాజిటివ్ బజ్ మధ్య ఈ సినిమా రిలీజవుతోంది. దీని లాగే విడుదల ముంగిట పాజిటివ్ బజ్ తెచ్చుకున్న మరో సినిమా ‘చి ల సౌ’ కూడా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా ఇది. దీని ప్రోమోలు కూడా మంచి ఫీలింగ్ ఇచ్చాయి. ఈ చిత్రం నాగార్జున మేనల్లుడు సుశాంత్ రాత మారుస్తుందని ధీమాగా ఉంది అక్కినేని ఫ్యామిలీ. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. ఇక శుక్రవారం విడదులవుతున్న మరో సినిమా.. బ్రాండ్ బాబు. మారుతి స్క్రిప్టుతో ప్రభాకర్ రూపొందించిన చిత్రమిది. సుమంత్ శైలేంద్ర.. ఈషా రెబ్బా జంటగా నటించారు. ఇది మాస్ కామెడీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. మరి ఈ మూడు చిత్రాల్లో ప్రేక్షకుల్ని మురిపించేవేవో చూద్దాం.