Begin typing your search above and press return to search.

చిరంజీవి చేసే ఫైట్స్ చూసి భయపడిపోయాను!

By:  Tupaki Desk   |   12 Nov 2021 10:30 AM GMT
చిరంజీవి చేసే ఫైట్స్ చూసి భయపడిపోయాను!
X
చిరంజీవి కెరియర్ ను మలుపు తిప్పేసి ఆయనను మాస్ యాక్షన్ హీరోగా నిలబెట్టిన చిత్రం 'ఖైదీ'. సంయుక్త మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. 1983లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది.

చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో నిలిచిపోయింది. ఈ సినిమాకి రచయితలుగా పనిచేసిన పరుచూరి బ్రదర్స్, ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించారు. తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమాను గురించి ప్రస్తావించారు.

"1978 జూలై 7వ తేదీన 'చలి చీమలు' సినిమాతో మా రచనా జీవితం ప్రారంభమైనా, చిరంజీవిగారితో 'ఖైదీ' చేసే అవకాశం వచ్చింది మాత్రం 1983లో. ఈ ఐదేళ్లలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం మాకు రాలేదు. 1983 ప్రథమార్థంలో కృష్ణ - శోభన్ బాబులతో 'ముందడుగు' .. ద్వితీయార్థంలో చిరంజీవితో 'ఖైదీ' చేయగలిగాము.

తాను ఇలాంటి సినిమా చేయాలని ఒక హీరో .. ఇలాంటి సినిమాను నిర్మించాలని ఒక నిర్మాత .. ఇలాంటి రచన చేయాలని ఒక రచయిత .. ఇలాంటి ఓ కథకు దర్శకత్వం వహించాలని ఒక దర్శకుడు కోరుకునే అతి కొద్ది సినిమాలలో 'ఖైదీ' ఒకటి.

'ఖైదీ' ఎంత చరిత్రను సృష్టించిందో మీ అందరికీ తెలుసు. నేను మళ్లీ మళ్లీ చెప్పనక్కర లేదు. 38 ఏళ్లు గడిచిపోయినా చిరంజీవి గారి పేరు చెప్పగానే అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చేది 'ఖైదీ'నే. ఇక్కడ చెప్పాల్సిన విశేషం ఏమిటంటే ఈ కథను చిరంజీవిగారు వినకుండానే ఓకే చేయడం.

అన్నయ్య టేప్ రికార్డర్ లో రికార్డు చేసింది .. క్లాప్ కొట్టిన తరువాత చిరంజీవిగారు విన్నారు. ఇది లవ్ స్టోరీ .. లవ్ లో వార్ స్టోరీ. ఒక పేద కుర్రవాడికి .. ఒక పెట్టుబడిదారుడి మధ్య జరిగిన ప్రేమ తాలూకు వార్ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ప్రేమయుద్ధం.

ఈ సినిమా మొత్తం బరువును .. బాధ్యతను చిరంజీవిగారు మోశారు. ఎంత రచనా ప్రాభవం ఉన్నా .. ఎంతటి దర్శక ప్రతిభ ఉన్నా నటుడు గనుక ఆ పాత్రకి ప్రాణం పోయకపోతే, ఆ సినిమా నిలబడదు. ఈ సినిమా కోసం చిరంజీవి ఫారెస్టులో చేస్తున్న ఫైట్స్ చూసి నేను భయపడిపోయాను.

నాకు తెలిసి చాలాసార్లు ఆయన డూప్ లేకుండా చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ చిరంజీవిగారు మాపై అదే అభిమానాన్ని చూపిస్తూ వస్తున్నారు. ఒకసారి 'లలితకళాతోరణం'లో చిరంజీవిగారు మాట్లాడుతూ, "తెలుగు సినిమా చరిత్ర ఎవరైనా రాస్తే, అందులో పరుచూరి బ్రదర్స్ కి చెరో పేజీ కేటాయించవలసిందే" అని చెప్పిన మహానుభావుడాయన" అంటూ చెప్పుకొచ్చారు.