Begin typing your search above and press return to search.

మూడు వారాల్లో ఆ హీరో సినిమాలు రెండు..

By:  Tupaki Desk   |   11 July 2017 12:30 AM GMT
మూడు వారాల్లో ఆ హీరో సినిమాలు రెండు..
X
హీరో గోపీచంద్ చివరి సినిమా ‘సౌఖ్యం’ విడుదలై ఏడాదిన్నర దాటిపోయింది. ఆ పరాజయాన్ని మరిపించే సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు గోపీ. కానీ అతడి సినిమాలు విడుదలకు నోచుకోవట్లేదు. మరుగున పడ్డ ‘ఆరడుగుల బుల్లెట్’ను బయటికి తీసి రిలీజ్ చేయాలని చూశారు కానీ.. చివరి నిమిషంలో తలెత్తిన ఆర్థిక వివాదాలతో సినిమా విడుదల ఆగిపోయింది. మరోవైపు ఎ.ఎం.రత్నం నిర్మాణంలో ఆయన తనయుడు జ్యోతికృష్ణ రూపొందించిన ‘ఆక్సిజన్’ కూడా ఇలాగే మరుగున పడి ఉంది.

ఐతే ఈ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు రత్నం. దీని రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. ఆగస్టు 18న ‘ఆక్సిజన్’ ప్రేక్షకుల ముందుకొస్తుందని ఆయన ప్రకటించారు. గోపీచంద్ నటించిన మరో సినిమా ‘గౌతమ్ నంద’ ఈ నెల 28న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ‘ఆక్సిజన్’ కూడా అనుకున్న ప్రకారం రిలీజయ్యేట్లయితే మూడు వారాల వ్యవధిలో గోపీ సినిమాలు రెండు థియేట్లలోకి దిగుతాయన్నామాట. ఐతే ‘ఆక్సిజన్’ సజావుగా విడుదలవ్వాలంటే ముందు ‘గౌతమ్ నంద’ బాగా ఆడాలి. అలాగే ‘ఆక్సిజన్’కు సంబంధించిన ఇష్యూస్ అన్నీ క్లోజ్ అవ్వాలి. ‘ఆరడుగుల బుల్లెట్’ మాదిరే దీనికీ ఫైనాన్స్ సమస్యలున్నట్లు సమాచారం. గతంలో తెలుగులో భారీ సినిమాలు నిర్మించిన రత్నం.. వరుస ఫ్లాపులతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి సినిమాలకు దూరమైపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో ‘ఆక్సిజన్’ నిర్మిస్తే.. దాని పరిస్థితి ఇలా తయారైంది.