Begin typing your search above and press return to search.

మెగాస్టార్ మార్కెట్ మూడు రోజులే అని తేల్చేశారా?

By:  Tupaki Desk   |   27 Sep 2019 7:07 AM GMT
మెగాస్టార్ మార్కెట్ మూడు రోజులే అని తేల్చేశారా?
X
ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు.. మిగతా ఫిలిం మేకర్లు అలెర్ట్ అయిపోతారు. లేనిపోని పోటీ ఎందుకనే ఆలోచనతో తమ సినిమాల రిలీజ్ డేట్లను మార్చుకుంటారు. ప్రభాస్ 'సాహో' విషయమే తీసుకోండి.. దేశవ్యాప్తంగా పలు ఇండస్ట్రీలలోని హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. బాలీవుడ్ నుంచి.. కోలీవుడ్ వరకూ అలానే జరిగింది. అలా వాయిదా పడిన సినిమాల్లో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. నిజానికి 'సాహో' కు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ భారీగా ఉండడానికి సోలో రిలీజ్ ఒక కారణం. అయితే 'సాహో' తర్వాత ఆ రేంజ్ లో ప్యాన్ ఇండియా ఫిలిం గా రిలీజ్ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'సైరా' కు మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.

'సైరా' చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న విడుదల చేస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు పోటీగా బాలీవుడ్ చిత్రం 'వార్' రిలీజ్ అవుతోంది. హృతిక్ రోషన్.. టైగర్ ష్రాఫ్ లు హీరోలుగా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలకు బయట 'సైరా' కు గట్టి పోటీనిచ్చేదే. అంతే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో 'వార్' కు పెద్ద సంఖ్యలోనే మల్టిప్లెక్స్ స్క్రీన్స్ కేటాయించాల్సి ఉంటుంది. సరే.. ఆ సినిమా అంటే బాలీవుడ్ చిత్రం అని సరిపెట్టుకోవచ్చు. కానీ తెలుగులో కూడా 'సైరా' రిలీజ్ అయిన మూడు రోజులకు గోపిచంద్ 'చాణక్య' ను రిలీజ్ చేస్తున్నారు.

సంక్రాంతి సీజన్లో తప్ప ఇతర సందర్భాలలో 'సైరా' లాంటి పెద్ద సినిమాకు పోటీగా మరో సినిమాను రిలీజ్ చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. మినిమమ్ ఒక వారం గ్యాప్ ఇచ్చిన తర్వాతే తమ సినిమాల రిలీజ్ ఉండేలా చూసుకుంటారు. కానీ గోపీచంద్ సినిమాకు మాత్రం ఇలా రిలీజ్ డేట్ లాక్ చేయడం అందరికీ షాక్ ఇస్తోంది. గోపిచంద్ మీడియం రేంజ్ హీరో.. వరస ఫ్లాపుల్లో ఉన్న హీరో. అయినా ధైర్యంగా అక్టోబర్ 5 డేట్ ను లాక్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంటే 'సైరా' లో పైకి చెప్పినంత విషయం లేదని అనుకుంటున్నారా అనే అనుమానాలు ఎదురవుతున్నాయి. మహా అయితే మూడు రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ హవా ఉంటుందని తేల్చేశారా.. అనే వెర్షన్ కూడా వినిపిస్తోంది. 'సైరా' ప్రమోషన్స్ చప్పగా ఉండడం కూడా ఈ వాదనకు బలాన్నిస్తోంది. నిన్న రిలీజ్ అయిన 'చాణక్య' ట్రైలర్ కు బాగుందనే రెస్పాన్స్ వచ్చింది. మరి ఉయ్యాలవాడకు ఈ చాణక్య ఏమైనా అడ్డుగా నిలుస్తాడా అని కూడా ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఏ విషయం తేలాలంటే మాత్రం మనం మరో వారం రోజులు వేచి చూడాల్సిందే.