Begin typing your search above and press return to search.

వెయ్యి కుటుంబాల సాయం ఊరికే పోదు గోపీ!

By:  Tupaki Desk   |   7 April 2020 4:30 AM GMT
వెయ్యి కుటుంబాల సాయం ఊరికే పోదు గోపీ!
X
క‌రోనా ప్ర‌పంచానికి పాఠాలు నేర్పిస్తోంది. సాధ‌రంగా ఆహ్వానించిన ధ‌నిక దేశాల్ని చాప చుట్టేసింది. పేద దేశాల్లో క‌రాళ నృత్యం చేస్తోంది. ఈ వైప‌రీత్యం నుంచి బ‌య‌ట‌ప‌డేది ఎలా? అని భార‌త్ సైతం త‌ల‌ ప‌ట్టుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌డం నెమ్మ‌దిగా మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతుండ‌డం పెను కంప‌నాలు పుట్టిస్తోంది. ఈ ప‌ర్య‌వ‌సానం పేద‌ల ఆక‌లి కేక‌ల్ని బ‌య‌ట పెడుతోంది. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని బ‌డుగు జీవులు ఎంద‌రు ఉన్నారో బ‌య‌టి ప్ర‌పంచానికి ఆవిష్క‌రిస్తుంది.

పేద‌లు .. కార్మికుల విష‌యంలో టాలీవుడ్ సెల‌బ్రిటీలు స్పందిస్తున్న తీరు ప్ర‌శంస‌లందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలోని సీసీసీ ఇండ‌స్ట్రీ పేద‌ల‌కు నిత్యావ‌స‌రాల సాయం చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కొన్ని నెల‌ల పాటు క‌రోనా క‌ల్లోలం నుంచి బ‌య‌ట‌ప‌డే వ‌ర‌కూ ఈ సాయం అంద‌నుంద‌ని సీసీసీ బృందాలు వెల్ల‌డిస్తున్నాయి. ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు నిత్యావ‌స‌ర సరుకుల్ని పేద‌ల‌కు పంచేందుకు ముందుకు రావ‌డం మాన‌వ‌త‌ను చాటుతోంది.

ఇక ఎగ్రెస్సివ్ హీరో గోపీచంద్ త‌న‌వంతు సాయమందించారు. 1000 పేద కుటుంబాలకు సహాయం చేసారాయ‌న‌. అన్ని కుటుంబాలకు కిరాణా సామాగ్రిని దాన‌మిచ్చారు. హైదరాబాద్‌ నందగిరి కొండల సమీపంలో పేదలకు బియ్యం.. పప్పు.. నూనెను ఒక నెలకు స‌రిప‌డా పంపిణీ చేశాడు. రోజువారీ కూలీల‌కు వేత‌న జీవుల‌కు ఇది పెద్ద ఊరట అనే చెప్పాలి. ప‌లువురు ప‌లు ర‌కాలుగా సాయం చేస్తున్నారు. సీసీసీ ఫండ్ కి పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి. సుమారు 7 కోట్ల మేర నిధి స‌మ‌కూరింద‌ని తెలుస్తోంది. దీనిని తెలుగు సినీకార్మికుల‌కు విత‌ర‌ణ చేయాల్సి ఉంటుంది. నిత్యావ‌స‌రాల కొర‌త లేకుండా ఆదుకోవాల్సి ఉంటుంది. ఇక గోపీచంద్ త‌ర‌హాలోనే ఇంత‌కుముందు అల్లరి న‌రేష్ స‌హా ప‌లువురు న‌వ‌త‌రం హీరోలు త‌మ‌వంతు సాయాన్ని అందించ‌డం స్ఫూర్తి నింపింది. గోపీచంద్ ప్రస్తుతం సీటీమార్ అనే స్పోర్ట్స్ డ్రామాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సంపత్ నంది ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం లో తమన్నా క‌థానాయిక‌గా న‌టిస్తోంది.