Begin typing your search above and press return to search.

వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్‌?

By:  Tupaki Desk   |   8 Nov 2016 7:30 AM GMT
వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్‌?
X
గోపీచంద్ సినిమా అన‌గానే మాస్ సినిమాలే గుర్తుకొస్తాయి. మాస్ మార్కెట్‌ పై బ‌ల‌మైన ప‌ట్టుని సొంతం చేసుకున్నాడాయ‌న‌. క్రౌడ్ పుల్ల‌ర్‌గా గోపీకి పేరుంది. అందుకే నిర్మాతలు ఆయ‌న‌తో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ప్ర‌స్తుతం ఆక్సిజ‌న్‌ లో న‌టిస్తున్న గోపీచంద్ త‌దుప‌రి వ‌రుస‌గా సినిమాలు చేయ‌డానికి ప్లాన్ చేసుకొంటున్నారు. కె.కె.రాధామోహ‌న్ నిర్మాణంలో ఓ సినిమా - మిర్యాల ర‌వీంద‌ర్‌ రెడ్డి నిర్మాణంలో మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు. నిర్మాత‌లైతే ఉన్నారు కానీ, గోపీచంద్‌ కి త‌గ్గ క‌థ‌ల్ని సిద్ధం చేసుకొచ్చే ద‌ర్శ‌కులే క‌రువ‌య్యారు. స‌రైన విజ‌యాలు లేని ఈ ద‌శ‌లో త‌న కెరీర్‌ కి ఓ బ‌ల‌మైన సినిమా కావాల‌నుకొంటున్నాడు గోపీచంద్‌.

అందుకే ఆషామాషీ క‌థ‌ల్ని ప‌క్క‌న‌పెట్టి, ఆల‌స్య‌మైనా కాస్త మంచి క‌థ‌తోనే సినిమాచేయాల‌ని డిసైడ్ అయ్యాడు. స్టార్ ద‌ర్శ‌కుల‌తో సినిమా చేయ‌డం అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్న ఆయ‌నకి వి.వి.వినాయ‌క్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్టు తెలిసింది. వినాయ‌క్ త‌న ద‌గ్గ‌ర ఉన్న ఓ పోలీసు క‌థ‌ని గోపీచంద్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిస్తాన‌ని మాటిచ్చాడట‌. ప్ర‌స్తుతం చిరంజీవి 150వ సినిమాని చేస్తున్నాడు వినాయ‌క్‌. ఆ చిత్రం పూర్త‌వ్వ‌గానే గోపీచంద్ సినిమాని ప్రారంభించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. వినాయ‌క్ గోపీచంద్‌తో సినిమా చేస్తుండ‌డానికి ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంద‌ట‌. నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌ రెడ్డి వినాయ‌క్‌ కి స‌న్నిహితుడు. ఎప్ప‌ట్నుంచో త‌న‌కి ఓ సినిమా చేసి పెట్ట‌మ‌ని ర‌వీంద‌ర్ రెడ్డి కోరుతున్నాడ‌ట‌. ఇదే స‌మ‌యంలో ర‌వీంద‌ర్‌ రెడ్డి ద‌గ్గ‌ర గోపీచంద్ కాల్షీట్లు కూడా తీసుకొన్నాడ‌ట‌. ఆ ర‌కంగా ఈ కాంబినేష‌న్‌ లో ప్రాజెక్టు సెట్ట‌యింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అదెంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/