Begin typing your search above and press return to search.

'జై బాలయ్య' టైటిల్ పై కసిగా జరుగుతున్న కసరత్తు!

By:  Tupaki Desk   |   13 Jan 2022 2:30 AM GMT
జై బాలయ్య టైటిల్ పై కసిగా జరుగుతున్న కసరత్తు!
X
బాలకృష్ణ కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'అఖండ' సంచలన విజయాన్ని సాధించింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేసింది. సాధారణంగా బాలకృష్ణ సినిమాలకి మాస్ ఆడియన్స్ ఎక్కువగా వస్తుంటారు. అలాంటిది ఈ సినిమాలో మాస్ యాక్షన్ కి .. దైవబలాన్ని కూడా జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో బోయపాటి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా కోసం తమన్ స్వరపరిచిన 'జై బాలయ్య' సాంగ్ జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోయింది. 'జై బాలయ్య' అనే మాట అభిమానుల నోట్లో నానేదే అయినా, ఈ పాటతో అది మరింత పాప్యులర్ అయింది.

దాంతో ఇప్పుడు బాలకృష్ణ తదుపరి సినిమాకి అదే టైటిల్ ను సెట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్టు దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఉండనుంది. రవితేజ 'క్రాక్' సినిమాతో హిట్ కొట్టిన ఆయన ఆ తరువాత సినిమాను బాలయ్యతో చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. రాయలసీమ నేపథ్యంలో .. 'వేటపాలెం'లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ నటించనుంది.

చిరంజీవి హీరోగా 1997లో 'మాస్టర్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో బాగున్నా రా బాగున్నారా .. బావగారూ బాగున్నారా' అనే పాట సూపర్ హిట్ అయింది. జనంలోకి బాగా వెళ్లిన ఆ పాటలో నుంచే 'బావగారూ బాగున్నారా' అనే టైటిల్ ను సెట్ చేసుకుని, ఆ మరుసటి ఏడాదే ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే విధంగా 'అఖండ' సినిమాలోని పాప్యులర్ పాట 'జై బాలయ్య' .. బాలకృష్ణ తరువాత సినిమాకి టైటిల్ గా మారనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇక గతంలో చిరంజీవి హీరోగా 'జై చిరంజీవ' అనే టైటిల్ తో సినిమా వచ్చింది. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకి కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. 2005లో వచ్చిన ఈ సినిమా ఇటు ఫ్లాప్ అని చెప్పలేం .. అటు సూపర్ హిట్టూ అనలేం .. ఓ మాదిరిగా ఆడిందంతే. మరి ఇప్పుడు బాలయ్య సినిమాకి 'జై బాలయ్య' అనే టైటిల్ పెడితే ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది ఆసక్తికరంగా మారింది. టైటిల్ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గోపీచంద్ మలినేని ఈ సినిమాను దసరాకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.