Begin typing your search above and press return to search.

నయన్ దంపతులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా..?

By:  Tupaki Desk   |   26 Oct 2022 4:03 AM GMT
నయన్ దంపతులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా..?
X
సౌత్ స్టార్ కపుల్ నయనతార మరియు ఆమె భర్త విఘ్నేష్ శివన్ లు ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వివాహం జరిగిన నాలుగు నెలలకే ఈ దంపతులు సరోగసీ విధానం ద్వారా తల్లిదండ్రులు అయ్యారు. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది.

సరోగసీ ద్వారా పిల్లల్ని కనడంపై నయన్ దంపతులపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఈ ఇష్యూలో తమిళనాడు ప్రభుత్వం కూడా కలుగజేసుకుంది. ఈ వ్యవహారమంతా చట్టబద్ధంగా నిబంధనలకు లోబడే జరిగిందా అనే విషయాన్ని నిర్ధారించడానికి త్రిసభ్య కమిటీని నియమించింది.

భారతీయ చట్టం ప్రకారం, ఒక జంట తమ వివాహమైన ఐదేళ్ల తర్వాత చెల్లుబాటు అయ్యే వైద్యపరమైన కారణాలను కలిగి ఉంటే మాత్రమే సరోగసీ పద్ధతిని ఎంచుకోవచ్చు. కానీ నయనతార దంపతులు మాత్రం పెళ్ళైన తర్వాత నాలుగు నెలలకే పిల్లలకు జన్మనిచ్చారు.

దీనిపై తమిళనాడు ప్రభుత్వ కమిటీ విచారణ చేపట్టిన నేపథ్యంలో.. నయన్ - విఘ్నేష్ శివన్ లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే సరోగసీ వివాదం పై విచారణ పూర్తి చేసిన కమిటీ.. నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, నయనతార మరియు ఆమె భర్త వాదనలతో ప్రభుత్వ బృందం సంతృప్తి చెందింది.

విగ్నేష్ దంపతులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని నివేదికలు పేర్కొంటున్నాయి. కమిటీ విచారణలో తాము ఆరేళ్ల క్రిత‌మే పెళ్లి చేసుకున్నామని.. గతేడాది స‌రోగ‌సీ కోసం త‌మ పేర్లను న‌మోదు చేయించుకొన్నామ‌ని నయనతార - విగ్నేష్ లు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

దీనికి సరైన ఆధారాలు సమర్పించడం వల్లనే ఈ వివాదంలో స్టార్ కపుల్ పై తమిళనాడు సర్కారు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదనే టాక్ నడుస్తోంది. నయనతార మరియు ఆమె భర్త ఇద్దరూ కూడా ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ తో చాలా సన్నిహితంగా ఉంటారు. ఈ నేపథ్యంలో సరోగసీ వ్యవహారంలో వారికి సహాయం అందిందేమో అని సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న నయనతార - విగ్నేష్ శివన్ జంట.. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 9న తాము కవలలకు తల్లిదండ్రులు అయినట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.