Begin typing your search above and press return to search.

కేబినెట్ భేటీలో టికెట్ రేట్ల‌పై తాడో పేడో తేల్చేస్తార‌ట‌!

By:  Tupaki Desk   |   28 Oct 2021 7:47 AM GMT
కేబినెట్ భేటీలో టికెట్ రేట్ల‌పై తాడో పేడో తేల్చేస్తార‌ట‌!
X
సినిమా టిక్కెట్ల పంచాయితీ ఇప్ప‌ట్లో తేలుతుందా లేదా?.. ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం అంత సులువేమీ కాదు. రేట్ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం మొండి ప‌ట్టు అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. దీనికి కార‌ణం బ్లాక్ టికెట్ దందాతో థియేట‌ర్ య‌జ‌మానులు ఎగ్జిబిట‌ర్లు ప్ర‌జ‌ల్ని నిలువు దోపిడీ చేస్తున్నార‌న్న భావ‌న ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో అధికారుల్లో నెల‌కొంది. ఇన్నాళ్లు ప్ర‌భుత్వాలు దీనిని చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించాయి. కానీ ప్ర‌స్తుతం ఏపీలో పాగా వేసిన వైకాపా ప్ర‌భుత్వం అందుకు సిద్ధంగా లేద‌ని తెలుస్తోంది. ఎట్టి ప‌రిస్థితిలో ప‌న్ను ఎగ‌వేత‌ల్ని ఉపేక్షించేది లేద‌ని మొండి ప‌ట్టుతో ఉంది.

ఇప్ప‌టికే ప‌లుమార్లు సినీప్ర‌ముఖుల‌తో మంత్రి పేర్ని నాని భేటీలో ఇదే విష‌యాన్ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. బ్లాక్ మార్కెట్ దందాకు చెక్ పెట్టే వ‌ర‌కూ నిదురించే ఆలోచ‌న‌లో సీఎం జ‌గ‌న్ లేర‌ని పేర్ని చాలా స్ప‌ష్ఠంగా సినీపెద్ద‌ల‌కు వెల్ల‌డించారు. అందుకే ప్ర‌భుత్వ పోర్ట‌ల్ ని ప్రారంభిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అన్ని థియేట‌ర్ల టిక్కెట్లు ఇక ఈ పోర్ట‌ల్ ద్వారానే అమ్మాల్సి ఉంటుంది. తొలిగా సినీపెద్ద‌ల్ని సంప్ర‌దించాకే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ప‌న్ను ఎగ‌వేత‌ల్ని నిలువ‌రించేందుకే ఈ ఏర్పాటు చేస్తున్నామ‌ని ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పున మంత్రి వర్యులు వెల్ల‌డించారు.

నేడు సినిమా టికెటింగ్ పోర్టల్‌ కు ఏపీ కేబినెట్ ఆమోదిస్తుందా లేదా? అన్న‌ది తేల‌నుందని తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశంలో చర్చించి ముందుకెళ్లాలనే నిర్ణయానికి ప్రభుత్వం రానుంది. ప్రభుత్వ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల విక్రయంపై నేడు కేబినెట్ లో చర్చించి మంత్రివర్గం తుది ఆమోదం తెలపనుంది. టిక్కెట్ రేట్లను పెంచడం.. ఇష్టానుసారంగా షోలు వేయడాన్ని నియంత్రించ‌డ‌మే దీని ఉద్ధేశ‌మ‌ని ప్ర‌జ‌ల‌కు తెల‌ప‌నున్నారు. నేడు జరిగే కేబినెట్ భేటీలో తాడో పేడో తేల్చేస్తార‌ని కూడా కథ‌నాలు వ‌స్తున్నాయి.

ఇదే కేబినెట్‌లో భేటీలో నిర్మాత‌లు కోరిన‌ట్టు సినిమా టికెట్‌ ధరలపైనా ప్రభుత్వం పూర్తి స్థాయి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. రేట్లు పెంచాలా వ‌ద్దా.. ఇప్ప‌టి రేట్ల‌నే కొన‌సాగించాలా? పాత రేట్ల‌ను తిరిగి పున‌రుద్ధ‌రించాలా? అన్ని కూడా నేడే మంత్రి వ‌ర్గ భేటీలో చ‌ర్చించ‌నున్నారు.

ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ‌లో అంతా సందిగ్ధ‌త నెల‌కొంది. మునుముందు పెద్ద సినిమాల రిలీజ్ తేదీల్ని లాక్ చేయాలంటే పై అంశాల‌పై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ప‌లు భారీ చిత్రాలు రిలీజ్ కోసం వేచి చూస్తున్నాయి. బాల‌య్య - అఖండ‌.. నాని -శ్యామ్ సింఘ‌రాయ్.. బ‌న్ని -పుష్ప చిత్రాలు డిసెంబ‌ర్ లో విడుద‌ల కావాల్సి ఉంది. టికెట్ రేట్ల‌పై క్లారిటీ రాక‌పోయినా ఆన్ లైన్ పోర్ట‌ల్ పై స్ప‌ష్ఠ‌త లేకున్నా ఇప్ప‌ట్లో సినిమాల్ని రిలీజ్ చేయ‌డం ఇబ్బందిక‌రం అని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇప్ప‌ట్లో క్లారిటీ రాక‌పోతే చాలా మంది జ‌న‌వ‌రి త‌ర్వాతే రిలీజ్ ల‌కు వ‌చ్చేందుకు వాయిదాలు వేసుకునే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనివ‌ల్ల థియేట‌ర్ రంగం ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏపీ తెలంగాణ‌లో థియేటర్ల‌కు స‌రైన కంటెంట్ అందేందుకు ఆస్కారం లేకుండా ఉంద‌ని ఒక వ‌ర్గం విశ్లేషిస్తోంది.

రెండేళ్లుగా థియేట‌ర్ కార్మికుల వెత‌లు

క‌రోనా క్రైసిస్ మొద‌లై ఇప్ప‌టికే రెండేళ్ల‌య్యింది. అప్ప‌టి నుంచి థియేట‌ర్ కార్మికుల‌కు జీతాల్లేక తిండికి క‌రువైన ప‌రిస్థితి నెల‌కొంది. మొద‌టి వేవ్ రెండో వేవ్ ఎగ్జిబిష‌న్ రంగాన్ని కుదేల‌య్యేలా చేసాయి. దీంతో థియేట‌ర్ల‌పై బ‌తుకుతున్న వేలాది కార్మికులు తీవ్ర ఇక్క‌ట్ల‌ను ఎదుర్కొంటున్నారు. క‌నీసం ఇప్ప‌టికి అయినా ఏపీ ప్ర‌భుత్వం దీనిపై క్లారిటీతో వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే ప‌రిశ్ర‌మ ఆకాంక్షిస్తోంది.