Begin typing your search above and press return to search.

అప్పుల భ‌యం..బ్యాంకుల విలీనం

By:  Tupaki Desk   |   5 Jun 2018 7:14 AM GMT
అప్పుల భ‌యం..బ్యాంకుల విలీనం
X
ఇటు బ్యాంక్ ఉద్యోగులు అటు వినియోగ‌దారులకు మ‌రో మింగుడుప‌డ‌ని వార్త‌. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరో భారీ విలీనానికి తెర లేస్తున్నది. గతేడాది ఏప్రిల్‌లో భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ)తోపాటు ఐదు అనుబంధ బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌ బీఐ)లో కలిసేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశీయంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 21కి చేరింది. బ్యాంకింగ్ రంగ ఉనికిని మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌ పీఏ) ప్రశ్నార్థకం చేస్తుండటం - వరుస కుంభకోణాలు, మోసాలు వెలుగుచూస్తుండటంతో బ్యాంకుల ఏకీకరణ అంశంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు మళ్లీ దృష్టి సారించింది. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) - ఐడీబీఐ బ్యాంక్ - ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) - సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ఒక్కటి చేయాలని కేంద్రం యోచిస్తున్నది.

ప్రపంచస్థాయి బ్యాంకుల నిర్మాణం కోసం భారీ ఏకీకరణ ప్రణాళికను రూపకల్పన చేసిన మోడీ సర్కారు.. ఏడాది క్రితం తొలి అడుగు ఎస్‌ బీఐతో వేసింది. ఇప్పుడు మలి అడుగును వేసే దిశగా వెళ్తుండగా, ఇది సాకారమైతే దేశంలో ఎస్‌ బీఐ తర్వాత అతిపెద్ద బ్యాంకు అవతరించనుంది. ఈ విలీన బ్యాంక్ ఆస్తుల విలువ రూ.16.58 లక్షల కోట్లుగా ఉండనుంది. ఈ నాలుగు బ్యాంకుల్లో బీవోబీ మినహా మిగతా మూడు బ్యాంకులూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) వ్యవస్థ కింద ఉన్నాయి. బలహీనంగా - సమస్యల్లో ఉన్న బ్యాంకులు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోకుండా నియంత్రించడం కోసమే పీసీఏ. ఇందులో ఉన్న బ్యాంకులు శాఖల విస్తరణకుగానీ - డివిడెండ్ల జారీకిగానీ - కొత్త రుణాల మంజూరుకుగానీ దూరంగా ఉండాలి. మరెన్నో అంశాలపైనా వీటిపై ఆర్బీఐ ఆంక్షలు విధిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీవోబీలో ఈ మూడు బ్యాంకులనూ విలీనం చేయాలని కేంద్రం చూస్తున్నట్లు సమాచారం. గతేడాది ఆగస్టులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్.. ప్రత్యామ్నాయ విధానం ద్వారా బ్యాంకుల విలీనానికి ఆమోదముద్ర వేసిన సంగతి విదితమే.

విలీనాలతో మొండి బకాయిల బెడద కూడా బ్యాంకులకు తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. బ్యాంకింగ్ రంగంలో, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నెలకొన్న తాజా పరిస్థితులు కూడా విలీనాలకు ప్రోత్సహిస్తున్నాయి. ఇదే సమయంలో వ్యతిరేక వర్గాల విమర్శలకూ పస లేకుండా చేస్తున్నాయి. నాలుగైదు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్న మోసగాళ్లకూ విలీనంతో చెక్ పెట్టినట్టవుతుందని, బ్యాంకుల సంఖ్య తగ్గడం వల్ల మొండి బకాయిలూ తగ్గుతాయని ప్రభుత్వం అంటోంది. అంతేగాక బలమైన బ్యాంకులు ఏర్పడుతాయని - విదేశీ బ్యాంకులకు గట్టి పోటీనిచ్చినట్లవుతుందని కూడా చెబుతోంది. పైగా బాసెల్-3 నిబంధనల అమలుకు మార్గం సుగమమవుతుందని కూడా వివరిస్తోంది. ఇదిలాఉండ‌గా...ఆంధ్రా బ్యాంక్ - బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - దేనా బ్యాంక్ - పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ -విజయా బ్యాంక్ - యునైటెడ్ బ్యాంక్‌ లనూ విలీనం చేసే ప్రతిపాదనలున్నాయి. నిజానికి దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌ బీ)లో పలు బలహీన - నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న బ్యాంకులను కలిపేయాలని మొదట్లో యోచించినా.. రూ.14,600 కోట్ల నీరవ్ మోదీ కుంభకోణం కారణంగా పీఎన్‌ బీ చరిత్ర మసకబారిపోయింది. దీంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఈ బ్యాంకునే ఇప్పుడు మరో బ్యాంకులో విలీనం చేసినా.. ఆశ్చర్యపోనక్కర్లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.