Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘గృహం’

By:  Tupaki Desk   |   17 Nov 2017 8:07 AM GMT
మూవీ రివ్యూ: ‘గృహం’
X
చిత్రం : ‘గృహం’

నటీనటులు: సిద్దార్థ్ - ఆండ్రియా - అనీషా - అతుల్ కులకర్ణి - సురేష్ తదితరులు
సంగీతం: గిరీష్
ఛాయాగ్రహణం: శ్రేయస్ కృష్ణ
రచన: మిలింద్ రావు - సిద్దార్థ్
నిర్మాత: సిద్దార్థ్
దర్శకత్వం: మిలింద్ రావు

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’.. ‘బొమ్మరిల్లు’ లాంటి సినిమాలతో తెలుగులో ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యువ కథానాయకుడు సిద్దార్థ్.. ఆ తర్వాత ఆ ఫాలోయింగ్ ను నిలబెట్టుకోలేకపోయాడు. వరుస ఫ్లాపులతో తెలుగులో సినిమాలు చేయడమే మానేశాడు. కొన్నేళ్ల విరామం తర్వాత ఇప్పుడు తన గత సినిమాలకు పూర్తి భిన్నమైన హార్రర్ సినిమా ‘గృహం’తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘గృహం’ ట్రైలర్.. దీని గురించి సిద్ధు చెప్పిన మాటలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. ఆ అంచనాల్ని ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ:

డీప్ బ్రెయిన్ సర్జరీ చేయడంలో నిపుణుడైన డాక్టర్ కృష్ణకుమార్ అలియాస్ క్రిష్ (సిద్దార్థ్) తన భార్య లక్ష్మి (ఆండ్రియా)తో కలిసి సంతోషంగా జీవనాన్ని సాగిస్తుంటాడు. అతడి పక్కింట్లోకి కొత్తగా ఓ కుటుంబం వస్తుంది. తర్వాత ఆ ఇంట్లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ కుటుంబంలోని జెన్నీ (అనీషా) అనే అమ్మాయి చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడతుంది. ఆమెకు దయ్యం పట్టిందన్న సందేహాలు మొదలవుతాయి. ఆమెకు సాయం చేయబోయి క్రిష్ కుటుంబం కూడా చిక్కుల్లో పడుతుంది. ఇంతకీ జెన్నీకి నిజంగానే దయ్యం పట్టిందా.. ఆ ఇంట్లో ఉన్న సమస్య ఏంటి.. చివరికి ఈ సమస్య ఎలా పరిష్కారమైంది.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘గృహం’ రూపంలో హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని హార్రర్ సినిమా తీశామని.. చాలా ఏళ్ల తర్వాత ఇండియాలో వచ్చిన ప్యూర్ హార్రర్ మూవీ అని చెప్పుకున్నాడు సిద్దార్థ్. అతడి మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదు. నిజంగానే ‘గృహం’ చూస్తున్నపుడు హాలీవుడ్ హార్రర్ థ్రిల్లర్లు చూస్తున్న భావన కలుగుతుంది. అలాగే ఇదొక ప్యూర్ హార్రర్ మూవీ. మధ్యలో హార్రర్లోకి కామెడీ జొరబడిపోవడంతో ‘భయం’ అనే రసానికి దూరమైపోయిన ప్రేక్షకులకు మళ్లీ నిఖార్సయిన భయాన్ని రుచిచూపిస్తుంది ‘గృహం’. ఓ సామాజిక సమస్య చుట్టూ కథను అల్లడం వల్ల ఎమోషనల్ గా కూడా ఈ కథ ప్రేక్షకులకు కనెక్టయ్యే అవకాశముంది. హార్రర్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ‘గృహం’ కచ్చితంగా బాగా కనెక్టవుతుంది.

ఒక పెద్ద భవంతిలోకి కొత్తగా ఒక కుటుంబం రావడం.. అందులోని ఓ వ్యక్తికి దయ్యం పట్టడం.. మిగతా వాళ్లకు భయానక అనుభవాలు ఎదురవడం.. సమస్య తీవ్ర రూపం దాల్చడం.. ఈ సమస్య వెనుక గతం బయట పడటం.. చివరగా పరిష్కారం కావడం.. హార్రర్ సినిమాలు ఎందులైనా బేసిగ్గా కనిపించే కథ ఇది. ‘గృహం’ కూడా అందుకు భిన్నమేమీ కాదు. ఈ లైన్లో చూస్తే ‘గృహం’లో కొత్తదనం ఏమీ కనిపించదు. కానీ ఈ కథను చెప్పిన విధానం.. పాత్రలు.. నేపథ్యం అన్నీ కొత్తగా ఉండటంతో ‘గృహం’ భిన్నమైన అనుభూతిని పంచుతుంది.

హార్రర్ సినిమాలకు అట్మాస్ఫియర్ అనేది చాలా కీలకమైన విషయం. ప్రేక్షకుల్ని భయపెట్టడంలో ఈ ఫ్యాక్టర్ కీలక పాత్ర పోషిస్తుంది. ‘గృహం’ సినిమాలో ఉన్న పెద్ద ప్లాస్ పాయింట్లలో ఇది కూడా ఒకటి. హిమాలయాల ఒడిలో ఉండే ఇంట్లో ఈ కథను నడిపించడం వల్ల ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి కలగడమే కాదు.. ఆ ఇంటి చుట్టూ ఉండే వాతావరణం మనల్ని ముందే హార్రర్ మూడ్ లోకి తీసుకెళ్తుంది. దీనికి తోడు సెట్టింగ్స్.. అందులోని ప్రాపర్టీస్.. కెమెరా పనితనం.. నేపథ్య సంగీతం.. ఇలా ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు అవసరమైన సరంజామా అంతా బాగా కుదిరింది. ఇక రైటింగ్.. టేకింగ్.. నటీనటుల అభినయం.. అన్నీ కూడా ఒక దానికొకటి కాంప్లిమెంట్ చేసుకోవడంతో ‘గృహం’ భయపెడుతూ.. ఆసక్తి రేకెత్తిస్తూ.. ఉత్కంఠ పెంచుతూ సాగుతుంది.

‘గృహం’ చూస్తూ కనీసం అరడజను సార్లయినా ఉలిక్కి పడటం ఖాయం. హార్రర్ సినిమాలంటే చాలా వరకు దయ్యాల్ని భయానక రూపంలో చూపిస్తూ భయపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇందులో కూడా అలాంటి సీన్స్ కొన్ని ఉన్నాయి. కానీ అసలు దయ్యాన్నే చూపించకుండా భయపెట్టడంలో కూడా దర్శకుడు మిలింద్ రావు విజయవంతమయ్యాడు. అమ్మాయి బావిలో దూకేసే సీన్.. కర్టెన్ చాటున చిన్న పాప ఉన్న భ్రాంతి కలిగించే సన్నివేశం.. ఎవరి ప్రమేయం లేకుండా డిక్టాఫోన్ నుంచి మ్యూజిక్ వినిపించే మరో సీన్.. ఇలా చెప్పుకోవడానికి ఇలాంటి సీన్లు చాలానే ఉన్నాయి. ఎంత ప్రిపేర్ అయినప్పటికీ సినిమాలో ఏదో ఒక చోట ఒళ్లు జిల్లుమనడం ఖాయం.

మొదట్లో ‘గృహం’ చాలా రొమాంటిగ్గా మొదలై.. ఆ తర్వాత హార్రర్ బాటలోకి వెళ్తుంది. హాలీవుడ్ స్థాయి సినిమా చూపించాలనే ప్రయత్నంలో రొమాన్స్ కొంచెం ఘాటుగానే ఉండేలా చూసుకున్నారు. బోల్డ్ గా సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. సిద్ధు-ఆండ్రియా మధ్య ఇంటిమేట్ సీన్లు ఘాటుగా ఉంటాయి. వీళ్ల బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో కథ కొంచెం నెమ్మదిగా ఆరంభమవుతుంది. ఆ తర్వాత జెన్నీ పాత్ర ప్రవేశంతో కథలో కదలిక వస్తుంది. ఆ పాత్ర విచిత్రంగా ప్రవర్తించడం మొదలయ్యాక అలజడి మొదలవుతుంది. కొన్ని భయానక సన్నివేశాల తర్వాత విరామానికి ముందు దయ్యం విశ్వరూపం చూపించే సన్నివేశం గగుర్పాటుకు గురి చేస్తుంది. ఆ సీన్ సినిమాకు మేజర్ హైలైట్.

ద్వితీయార్ధంలో ‘గృహం’ కొంచెం ఎగుడుదిగుడుగా సాగుతుంది. దయ్యం విశ్వరూపం చూశాక ఉండాల్సిన అలజడి ఏమీ పాత్రల్లో కనిపించదు. అందరూ పెద్దగా ఏం జరగనట్లే ఉంటారు. జెన్నీ పాత్ర నుంచి ఏదో ఆశిస్తాం కానీ.. దాన్ని ఒక దశ దాటాక పక్కన పెట్టేశారు. సరిగా ఉపయోగించుకోలేదు. ఇంటర్వెల్ తర్వాత కొంచెం ట్రాక్ తప్పినట్లుగా కనిపించే ‘గృహం’ మళ్లీ ఫ్లాష్ బ్యాక్ దగ్గర దారిలోకి వస్తుంది. ఎమోషనల్ గా కదిలిస్తూ.. భయపెడుతూ సాగే ఫ్లాష్ బ్యాక్ ఆకట్టుకుంటుంది. ఐతే 80 ఏళ్ల కిందట ఏం జరిగిందో, ఇప్పుడేం జరుగుతోందో చూపిస్తారు కానీ.. మధ్యలో ఏమైందన్న డీటైలింగ్ లేదు. దీని వల్ల కనెక్షన్ కట్ అయిపోయింది. క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పతాక సన్నివేశం ఓకే అనిపిస్తుంది. మొత్తంగా నిఖార్సయిన హార్రర్ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ‘గృహం’ కచ్చితంగా సంతృప్తి పరుస్తుంది. అక్కడక్కడా కొన్ని లోపాలున్నప్పటికీ.. వాటిని మరిపించే పాజిటివ్స్ ఇందులో చాలానే ఉన్నాయి. ‘గృహం’లో రొమాన్స్.. హార్రర్ డోస్ ఎక్కువ. ఈ సినిమా చూడాలనుకునేవారు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

నటీనటులు:

‘గృహం’లో సిద్దార్థ్ ను చూసి కచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఇంతకుముందు తెలుగులో చాలా వరకు లవర్ బాయ్ పాత్రలే చేసిన సిద్ధు ఈ సినిమాతో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నాడు. అతను హీరోలా కాకుండా ఒక పాత్రలాగే కనిపిస్తాడు. ఒక దశలో సిద్ధు పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదనిపిస్తుంది. కానీ క్లైమాక్సులో ఆ పాత్ర లీడ్ తీసుకుని సినిమాకు భిన్నమైన ముగింపునిస్తుంది. పతాక సన్నివేశాల్లో సిద్ధు నటన ఆకట్టుకుంటుంది. డాక్టర్ పాత్రను కూడా అర్థం చేసుకుని నటించాడు సిద్ధు. రొమాంటిక్ సన్నివేశాల్లోనూ సిద్ధు బాగా చేశాడు. ఆ సన్నివేశాల్లో ఆండ్రియా కూడా బోల్డ్ గా నటించింది. ఆమె కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఐతే నటన పరంగా సినిమాలో అందరి కంటే ఎక్కువ ఆకట్టుకునేదంటే జెన్నీ క్యారెక్టర్లో కనిపించిన అనీషానే. ఇంటర్వెల్ ముందు ఎపిసోడ్లో ఆమె నటనకు షాకైపోతాం. ప్రేక్షకుల్లో ఒక అలజడి రేగేలా ఆమె నటన సాగింది. కేవలం హావభావాలతోనే కాక.. తన శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టుకుంటూ ఆమె నటించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సురేష్.. అతుల్ కులకర్ణి.. మంత్రగాడి పాత్రలో చేసిన నటుడు కూడా బాగా చేశారు.

సాంకేతికవర్గం:

‘గృహం’లో సాంకేతిక నిపుణుల ప్రతిభ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. గిరీష్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు అతి పెద్ద అస్సెట్. నేపథ్య సంగీతం కొత్తగా అనిపిస్తుంది. ప్రేక్షకుల్ని భయపెట్టడంలో అది కీలక పాత్ర పోషించింది. అన్ని చోట్లా మ్యూజిక్‌ తోనే కాక కొన్ని చోట్ల నిశ్శబ్దంతోనూ భయపెట్టాడు సంగీత దర్శకుడు. సౌండ్ డిజైన్ కూడా చాలా బాగా చేశారు. శ్రేయస్ కృష్ణ ఛాయాగ్రహణం కూడా అత్యున్నత స్థాయిలో సాగింది. కెమెరామన్ కూడా తన వంతుగా భయపెట్టడానికి బాగానే కృషి చేశాడు. అతను ఎంచుకున్న కలర్ థీమ్స్ సినిమాకు బాగా సూటయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో నిర్మాత సిద్దార్థ్ కు మంచి మార్కులు పడతాయి. దర్శకుడు మిలింద్.. హార్రర్ జానర్ మీద తన పట్టును చూపించాడు. రైటింగ్.. డైరెక్షన్ రెండింట్లోనూ అతను ప్రతిభ చాటుకున్నాడు. కొన్ని లోపాలున్నప్పటికీ అసలైన హార్రర్ సినిమా రుచి చూపించడంలో అతను విజయవంతమయ్యాడు.

చివరగా: గృహం.. భయపెట్టి.. థ్రిల్ చేస్తుంది!

రేటింగ్-3/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre