Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ః మ‌హేష్ బ్యాంక్ అకౌంట్లు సీజ్‌

By:  Tupaki Desk   |   27 Dec 2018 4:30 PM GMT
బ్రేకింగ్ః మ‌హేష్ బ్యాంక్ అకౌంట్లు సీజ్‌
X
జీఎస్టీ ఎపిసోడ్‌ లో కీల‌క ప‌రిణామం చోటు చేస‌కుంది. ప్రముఖ నటుడు మహేష్‌ బాబుకు చెందిన రెండు బ్యాంకు అకౌంట్లను జీఎస్‌ టీ కమిషనరేట్‌ కార్యాలయం జప్తు చేసింది. గడచిన పదేళ్ళ నుంచి సర్వీస్‌ ట్యాక్‌ బకాయిలు కట్టనందున బ్యాంకుల నుంచి సొమ్మును రికవర్‌ చేసినట్లు హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనరేట్‌ పేర్కొంది. ఇంతేకాకుండా నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే... మ‌హేష్‌ కు ఖాతాలున్న బ్యాంకు పై కూడా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఓ పత్రికా ప్రకటనలో వివ‌రాలు వెల్ల‌డించింది.

2007-08లో వివిధ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా పాల్గొన్నందుకు, ఆయా కంపెనీల ఉత్పత్తుల ప్రకటనల్లో నటించి తన సేవలు అందించారని, దీనికిగాను వసూలు చేసిన రెమ్యూనరేషన్‌ పై మహేష్‌ బాబు సర్వీస్‌ ట్యాక్స్‌ కట్టలేదని పేర్కొంది. 2007-08 నాటి బకాయి రూ. 18.5 లక్షలు కాగా, ఆ తరవాత కూడా సదరు సేవలకు ఆయన సర్వీస్‌ ట్యాక్స్‌ కట్టేలేదని పేర్కొంది. ప్రస్తుతం మహేష్‌ బాబు సర్వీస్‌ ట్యాక్స్‌ బకాయి రూ. 39 లక్షలు దాకా చేరిందని కమిషనరేట్‌ తెలిపింది.

బకాయిలతో పాటు వాటి పై వడ్డీ, పెనాల్టి కలిపి రూ. 73.5 లక్షలకు చేరినట్లు వివరించింది. బకాయిలు వసూలులో భాగంగా మహేష్‌ బాబుకు చెందిన యాక్సిస్‌ బ్యాంక్‌ ఖాతాలో ఉన్న రూ. 42.96 లక్షలను తాము రికవర్‌ చేసినట్లు తెలిపింది. అలాగే ఆయనకు ఐసీఐసీఐ బ్యాంక్‌ లో ఉన్న ఖాతాను కూడా జప్తు చేశామని, అయితే ఖాతా నుంచి ఇంకా డబ్బు బదిలీ కాలేదని పేర్కొంది. రేపటి లోగా బ్యాంక్‌ సదరు మొత్తాన్ని తమ శాఖకు బదిలీ చేయాలని, లేనిపక్షంలో ఆ బ్యాంక్‌ పై కూడా చర్య తీసుకుంటామని కమిషనరేట్ తేల్చిచెప్పింది.