Begin typing your search above and press return to search.

‘స్పైడర్’కు మరో పంచ్ పడింది

By:  Tupaki Desk   |   3 Oct 2017 5:14 PM GMT
‘స్పైడర్’కు మరో పంచ్ పడింది
X
స్పైడర్ సినిమా బాగా నడుస్తున్న తమిళనాట కూడా అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం విధించే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కి తోడు తమిళనాడు ప్రభుత్వం కూడా అదనంగా పది శాతం దాకా వినోదపు పన్ను వేస్తుండటాన్ని నిరసిస్తూ ఆ రాష్ట్రంలోని మల్టీప్లెక్సులు స్ట్రైక్ చేస్తున్నాయి. కొన్ని మల్టీప్లెక్సులు నడుస్తున్నప్పటికీ.. కొన్ని మాత్రం షోలు ఆపేశాయి. ఇది ‘స్పైడర్’కు ఎదురు దెబ్బే.

‘స్పైడర్’కు పోటీగా దసరా సీజన్లో విడుదలైన తమిళ సినిమా ‘కరుప్పన్’ రూరల్ మూవీ. అది సింగిల్ స్క్రీన్లలో బాగా ఆడుతుండగా.. మల్టీప్లెక్సుల్లో ‘స్పైడర్’ ఆధిపత్యం చలాయిస్తోంది. ఐతే ఇప్పుడు స్ట్రైక్ కారణంగా ఈ చిత్ర వసూళ్లపై ప్రభావం పడుతోంది. తెలుగుతో పోలిస్తే తమిళంలో ‘స్పైడర్’కు మంచి టాక్ వచ్చింది. వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఇంతలో ఈ అనుకోని అవాంతరం ఎదురైంది. ప్రస్తుతం దేశం మొత్తంలో సినిమాలపై అత్యధిక పన్ను పడుతున్న రాష్ట్రం తమిళనాడే అని అంటున్నారు అక్కడి విశ్లేషకులు. టికెట్ల రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి తమిళనాట. ఇది సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కోలీవుడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్టీపై ఇప్పటికే తమిళ సినీ వర్గాలు దశల వారీగా ఆందోళనలు నిర్వహించాయి.