Begin typing your search above and press return to search.

'సైరా' కు జీఎస్టీ గుదిబండ అయ్యిందా?

By:  Tupaki Desk   |   13 Dec 2019 3:01 PM GMT
సైరా కు జీఎస్టీ గుదిబండ అయ్యిందా?
X
స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధుల క‌థ‌ల్ని తెర‌పైకి తెస్తే ప్ర‌భుత్వాల నుంచి ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వ‌డం అనే సత్సాంప్ర‌దాయం ఒకప్పుడు ఉంది. అటు బాలీవుడ్ లో కొన్ని చిత్రాల‌కు ఈ త‌ర‌హా మిన‌హాయింపులు ఇచ్చి కొంత‌వ‌ర‌కూ నిర్మాత‌ల్ని ఆదుకునే ప్ర‌య‌త్నం జ‌రిగింది. ఇంత‌కుముందు గుణ‌శేఖ‌ర్ `రుద్ర‌మ‌దేవి` చిత్రానికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోయినా.. కేసీఆర్ ప్ర‌భుత్వం ప‌న్ను మిన‌హాయించ‌డం తెలిసిందే. తెలంగాణ సంస్కృతి సాంప్ర‌దాయాన్ని సినిమాలో ప్ర‌తిబింబించినందుకు కేసీఆర్ ప్ర‌భుత్వం ఈ మిన‌హాయింపును ఇచ్చింది.

అయితే అదే త‌ర‌హాలో `సైరా-న‌ర‌సింహారెడ్డి` చిత్రానికి ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పున అంతో ఇంతో అండ ఉంటుంద‌ని కొణిదెల కాంపౌండ్ భావించింద‌ట‌. ప‌న్ను మిన‌హాయింపు ఉంటే కొంత‌వ‌ర‌కూ న‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డే ఛాన్స్ ఉండేది. కానీ తెలుగు రాష్ట్రాల‌ ప్ర‌భుత్వాల నుంచి ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డం బాధించింద‌ట‌. `ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి` రాయ‌ల‌సీమ వీరుడి క‌థ‌. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వీరుడి క‌థ‌గా ప్రాచుర్యం పొందినా లాభం లేక‌పోయింది. క‌నీసం ఏపీ ప్ర‌భుత్వం ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వ‌లేదు. పైగా జీఎస్టీ బాదుడు త‌ప్ప‌లేదు. కేవ‌లం జీఎస్టీ రూపంలో నిర్మాత రామ్‌ చ‌ర‌ణ్‌ 40 కోట్లు చెల్లించార‌ట‌. ప‌న్ను మిన‌హాయింపు లేదు స‌రి క‌దా.. అంత పెద్ద మొత్తం జీఎస్టీ క‌ట్టడం అంటే మాట‌లా? అత్యంత భారీ బ‌డ్జెట్ తో తీసిన ఈ సినిమాని తెలుగు ప్రేక్ష‌కులే ఆదుకున్నారు. హిందీలో.. ఓవ‌ర్సీస్ లో ఆశించిన‌ది ద‌క్క‌లేదు. దాంతో న‌ష్టం తప్ప‌లేదు.

అయితే మార్కెట్ విశ్లేష‌కులు వేరొక కోణంలోనూ విశ్లేషిస్తున్నారు. అంతిమంగా సైరా లాభ‌న‌ష్టాలకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ఇంకా రావాల్సి ఉంది. నిర్మాత రామ్ చ‌ర‌ణ్ ఖ‌ర్చు చేసినంతా తిరిగి వ‌చ్చేసి ఉండొచ్చు.. సైరా లాభాలు తేలేక‌పోయినా న‌ష్టాల్ని మిగిల్చి ఉండ‌దు!!.. అని కూడా కొంద‌రు విశ్లేషిస్తున్నారు. సైరా చిత్రానికి దాదాపు 280 కోట్ల మేర షేర్ వ‌చ్చింద‌ని ఇదంతా తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తోనే సాధ్య‌మైంద‌ని రామ్ చ‌ర‌ణ్ ఇంత‌కుముందు స‌క్సెస్ వేడుక‌లో తెలిపారు. హిందీ ప్రేక్ష‌కులు ఆద‌రించ‌క‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింద‌ని అన్నారు.