Begin typing your search above and press return to search.

తమిళ నిర్మాతలు విలవిల

By:  Tupaki Desk   |   2 Jun 2017 8:10 AM GMT
తమిళ నిర్మాతలు విలవిల
X
త్వరలోనే దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం (జీఎస్టీ) అమల్లోకి రానుంది. సినీ రంగంపై జీఎస్టీ ప్రభావం బాగానే పడనుంది. ముఖ్యంగా దక్షిణాది సినీ పరిశ్రమ జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే దక్షిణాదిన రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను శాతం 10-15 శాతం మధ్య ఉంటుండగా.. జీఎస్టీలో 28 శాతం పన్ను చెల్లించుకోవాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పన్ను 15 శాతం ఉండగా.. సెప్టెంబరు 1 నుంచి దాదాపు రెట్టింపు పన్ను కట్టాల్సి ఉంటుంది. దీనిపై నిర్మాతలు కేంద్ర మంత్రిని కలిసి విన్నపాలు చేసినా అనుకున్న స్పందన రాలేదు. తెలుగు నిర్మాతలతో పోలిస్తే.. తమిళ ప్రొడ్యూసర్ల ఇబ్బంది మామూలుగా లేదు. పన్ను విషయంలో వారు విలవిలలాడిపోతున్నారు.

ఎందుకంటే తమిళ నిర్మాతలు అసలు వినోదపు పన్ను కింద రూపాయి కూడా చెల్లించట్లేదు. తమిళంలో టైటిల్ పెట్టి.. యు సర్టిఫికెట్ తెచ్చుకుంటే అక్కడ పన్ను మినహాయింపు ఇస్తున్నారు. ఈ ప్రకారమే నడుచుకుంటూ కొన్నేళ్లుగా పన్ను లేకుండా సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు తమిళ నిర్మాతలు. కానీ ఇకపై తమిళ టైటిల్ పెట్టినా.. యు సర్టిఫికెట్ తెచ్చుకున్నా ఫలితమేమీ ఉండదు. ఎవ్వరైనా పన్ను కట్టాల్సిందే. అది కూడా ఒకేసారి 28 శాతం పన్ను అనేసరికి తమిళ నిర్మాతల బాధ మామూలుగా లేదు. దీంతో జీఎస్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు కోలీవుడ్ ప్రొడ్యూసర్స్. ఐతే ఇప్పుడు తమిళనాట ఉన్న ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేసే పరిస్థితి లేదు.

కేంద్రం కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. ఒక్క సినీ రంగానికి మాత్రం ఏదైనా మినహాయింపు ఇస్తే.. తర్వాత మిగతా రంగాల నుంచి కూడా ఒత్తిడి ఎదురవుతుంది కాబట్టి.. కేంద్రం స్పందించే అవకాశాలు లేవు. పైగా ఉత్తరాదిన ముందు నుంచే వినోదపు పన్ను ఎక్కువ ఉంది కాబట్టి 28 శాతం పన్ను విషయంలో వారికి అభ్యంతరాలేమీ లేవు. కేవలం దక్షిణాది నిర్మాతలు అభ్యంతరాలు చెప్పారని కేంద్రం స్పందించకపోవచ్చు. కాబట్టి తమిళ నిర్మాతలకు సెప్టెంబరు నుంచి పన్ను పోటు భారీగానే ఉండబోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/