Begin typing your search above and press return to search.

టాలీవుడ్ నిర్మాత‌పై జీఎస్టీ దాడులు!

By:  Tupaki Desk   |   22 Feb 2018 5:11 AM GMT
టాలీవుడ్ నిర్మాత‌పై జీఎస్టీ దాడులు!
X
జీఎస్టీ అన్నంత‌నే వ‌ర్మ జీఎస్టీ గుర్తుకు వ‌చ్చేస్తోంది. మ‌రోసారి జీఎస్టీతో టాలీవుడ్ లింకు ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చి క‌ల‌క‌లం రేపుతోంది. అయితే..ఇది వ‌ర్మ జీఎస్టీ కాదు. రియ‌ల్ జీఎస్టీ. సినిమా నిర్మాణ స‌మ‌యంలో వివిధ విభాగాల నుంచి దాదాపు రూ.7కోట్లు జీఎస్టీ వ‌సూలు చేసిన ఒక తెలుగు నిర్మాత ప్ర‌భుత్వానికి జ‌మ చేయ‌ని ఉదంతం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. స‌ద‌రు తెలుగు నిర్మాత‌పై హైద‌రాబాద్ జీఎస్టీ క‌మిష‌నర్ కార్యాల‌య అధికారులు కేసు న‌మోదు చేసిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చి క‌ల‌క‌లం రేపుతోంది.

ప‌న్ను బ‌కాయిల ఉదంతంలో రూ.7 కోట్లు జీఎస్టీ వ‌సూలు చేసిన స‌ద‌రు నిర్మాత ఆ మొత్తాన్ని జ‌మ చేయ‌ని వైనాన్ని గుర్తించారు. దీంతో చ‌ట్టం త‌న ప‌ని తాను ప‌ని చేయ‌టం మొద‌లుకాగానే.. స‌ద‌రు నిర్మాత బుధ‌వారం రూ.2 కోట్ల మొత్తాన్ని హ‌డావుడిగా చెల్లించేయ‌గా.. మిగిలిన రూ.5 కోట్ల చెల్లింపు కోసం వారం రోజుల గ‌డువు కోరిన‌ట్లు తెలిసింది.

స‌ద‌రు నిర్మాత పేరు బ‌య‌ట‌కు రాన‌ప్ప‌టికీ.. రూ.7 కోట్ల మేర అంటే ప్ర‌ముఖ నిర్మాత‌ల్లో ఒక‌రై ఉండొచ్చ‌న్న అభిప్రాయం సినీ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. జీఎస్టీ విభాగానికి చెల్లించాల్సిన రూ.5 కోట్ల మొత్తాన్ని వారం వ్య‌వ‌ధిలో చెల్లించ‌ని ప‌క్షంలో నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసి త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లుగా హైద‌రాబాద్ జీఎస్టీ అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

వాస్త‌వానికి సినిమా నిర్మాత మాత్ర‌మే కాదు.. బ‌డా బ‌డా హోట‌ళ్లు.. వ్యాపార సంస్థ‌లు.. సేవా విభాగాలు ప్ర‌జ‌ల నుంచి జీఎస్టీని వ‌సూలు చేయ‌టం.. వాటిని ప్ర‌భుత్వానికి తిరిగి చెల్లించ‌కుండా చేస్తున్నారు. ఇలాంటి ఎగ‌వేత‌ల్ని క‌నుగొన‌టం అంత‌ తేలికైన విష‌యం కాదు. అదే స‌మ‌యంలో అదేమీ అసాధ్యమైన‌ది కూడా కాద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

త‌మ దృష్టికి వ‌చ్చిన ఫిర్యాదులు.. త‌నిఖీలు.. క్రాస్ చెకింగ్స్ ద్వారా ఇలాంటి ఎగ‌వేత‌ల్ని జీఎస్టీ అధికారులు గుర్తిస్తున్నారు. బ‌డా బాబుల విష‌యంలో గుర్తించేందుకు ఎక్కువ అవ‌కాశాలు ఉంటే.. చిన్న చిన్న వారి విష‌యంలో ఇలాంటివి క‌నుగొన‌టం అంత తేలికైన విష‌యం కాదు.

తాజాగా టాలీవుడ్ నిర్మాత విష‌యంలో చూస్తే.. త‌మ దృష్టికి వ‌చ్చిన స‌మాచారంపై వారం రోజుల పాటు దృష్టి సారించి కేసు న‌మోదు చేశారు. ద‌క్షిణాదిలో ఈ త‌ర‌హా కేసు ఇదే మొద‌టిది కావ‌టం గ‌మ‌నార్హం. ఈ వ్య‌వ‌హారం టాలీవుడ్ లో క‌ల‌క‌లం రేపింది. జీఎస్టీ అమ‌ల్లోకి వ‌చ్చాక జులై నుంచి స‌ద‌రు నిర్మాత తీసిన సినిమాల‌కు సంబంధించి వివిద విభాగాల నుంచి చెల్లింపుల స‌మ‌యంలో జీఎస్టీ కింద మొత్తాన్ని మిన‌హాయించారు. ఆ మొత్తాన్ని జీఎస్టీ విబాగానికి జ‌మ చేయ‌లేదు. దీంతో.. దృష్టి సారించిన అధికారులు స‌ద‌రు నిర్మాత మీద కేసు న‌మోదు చేశారు. దీనికి స్సంద‌న‌గా రూ.2కోట్ల మొత్తాన్ని చెల్లించి అరెస్ట్ ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్న‌ట్లుగా తెలుస్తోంది.