Begin typing your search above and press return to search.

100 కోట్లతో సినిమా.. అయ్యే పనేనా?

By:  Tupaki Desk   |   1 Nov 2017 10:16 AM IST
100 కోట్లతో సినిమా.. అయ్యే పనేనా?
X
భారీ సెట్టింగులు.. బహు భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే ట్రెండ్ కు డైరెక్టర్ గుణశేఖర్ ఒక్కడు సినిమా నుంచే మొదలెట్టాడు. ఆ తరవాత అర్జున్ సినిమా తీసినా సెట్టింగులకు పేరొచ్చింది కానీ నిర్మాత జేబులు ఖాళీ అయిపోయాయి. ఈ మధ్య భారీ ఖర్చుతో రుద్రమదేవి సినిమా తీసినా అడ్డంకులన్నీ తొలగించుకుని ఆ సినిమా రిలీజ్ చేయడానికి ఆపసోపాలు పడాల్సి వచ్చింది.

తాజాగా గుణశేఖర్ రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో హిరణ్యకశిపుడు అనే భారీ పౌరాణిక చిత్రం తీయబోతున్నాడని టాలీవుడ్ లో ఓ రూమర్ వినిపిస్తోంది. రానా హీరోగా ఇందులో నటించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ తలెత్తే సందేహం ఏమిటంటే గుణశేఖర్ కు అంత పెట్టుబడి ఎవరు పెడతారు? ఆమధ్య వచ్చిన రుద్రమదేవి షూటింగ్ పూర్తి చేసిన చాలా రోజుల వరకు రిలీజే చేయలేకపోయాడు. ఓ రకంగా పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగిరాని పరిస్థితి. పోనీ రానాకు అంత ఇమేజ్ ఉందా అనుకుంటే అతడి లేటెస్ట్ సినిమా నేనే రాజు.. నేనే మంత్రికి పట్టుమని రూ. 30 కోట్ల కలెక్షన్ రాలేదు. పోనీ మిగిలిన భాషల్లో డబ్బింగ్ చేసినా రూ. 50 కోట్ల వసూళ్లు చేరుకోవడమే కష్టం. అలాంటప్పుడు రూ. 100 కోట్లకు రిస్క్ ఎవరు చేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

బాహుబలి తర్వాత లార్జర్ దేన్ లైఫ్ తరహా సినిమాలు తీయడానికి ఓ మార్గం దొరికిందనే మాట నిజమే. కానీ అది అంత తేలిక కాదనే విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఖర్చు పెట్టేసినంత మాత్రాన హిట్ వరిస్తుందనే గ్యారంటీ ఏం లేదు. గుణశేఖర్ కు ఇది ఎదురైన అనుభవమే. ఇలాంటి పరిస్థితుల్లో రూ. 100 కోట్లతో హిరణ్యకశిపుడు తీయడమనే రూమర్ నిజమయ్యే అవకాశం ఏ కోశానా కనిపించడమే లేదు.