Begin typing your search above and press return to search.

ఎవరబ్బా.. ఈ తరం వీరాభిమన్యుడు?

By:  Tupaki Desk   |   1 Nov 2015 9:50 AM GMT
ఎవరబ్బా.. ఈ తరం వీరాభిమన్యుడు?
X
మొత్తానికి గుణశేఖర్ బయటపడిపోయేట్లే ఉంది పరిస్థితి. ఇప్పటికే రూ.55 కోట్ల దాకా కలెక్షన్లు కొల్లగొట్టి.. నాలుగో వారంలోనూ పర్వాలేదనిపిస్తోంది ‘రుద్రమదేవి’. ఇంకా తెలుగు, హిందీ శాటిలైట్ రైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి రూ.65-70 కోట్ల మధ్య తేలవచ్చు ‘రుద్రమదేవి’ లెక్క. అంటే గుణశేఖర్ దాదాపుగా సేఫ్ అయిపోయినట్లే. కాబట్టి ‘రుద్రమదేవి’ సినిమాతో గుణశేఖర్ కెరీర్ అంతమైపోతుందేమో అన్న భయాలేమీ అక్కర్లేదు. గుణ మళ్లీ మెగా ఫోన్ పట్టి సినిమా తీయడానికి మెండుగానే అవకాశాలున్నాయి.

ఐతే రుద్రమదేవి సినిమా చివర్లో హింట్ ఇచ్చినట్లు ‘ప్రతాపరుద్రుడు’ సినిమానే చేస్తాడా లేక వేరే సినిమా వైపు మొగ్గు చూపుతాడా అన్నదే కొంచెం డౌటుగా ఉంది. మొన్నటిదాకా ప్రతాప రుద్రుడు గ్యారెంటీ అన్నట్లే ప్రచారం జరిగింది కానీ.. ఇప్పుడు గుణ మదిలో కొత్త ఆలోచన మెదిలినట్లుంది. అతను తన ‘గుణ టీమ్ వర్క్స్’ బేనర్ మీద ‘వీరాభిమన్యు’ అనే కొత్త టైటిల్ ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించడమే ఈ సందేహాలకు కారణం. ఐతే అభిమన్యుడి కథతో ఇంతకుముందే శోభన్ బాబు హీరోగా ‘వీరాభిమన్యు’ సినిమా వచ్చింది. మళ్లీ ఆ చారిత్రక కథ చెప్పే ప్రయత్నం చేస్తాడా లేక మామూలు సినిమాకే ఆ టైటిల్ పెట్టాడా అన్నది తెలియాల్సి ఉంది. ఒక వేళ నిజంగా అభిమన్యుడి కథనే తీయాలనుకుంటే.. ఆ పాత్రను ఎవరు పోషిస్తారో చూడాలి.