Begin typing your search above and press return to search.

మార్కెటింగ్‌ ప్లాన్‌ తయారుచేస్కోండి సార్‌

By:  Tupaki Desk   |   16 July 2015 10:56 PM GMT
మార్కెటింగ్‌ ప్లాన్‌ తయారుచేస్కోండి సార్‌
X
బాహుబలి తర్వాత మళ్లీ అలాంటి చర్చ ఓ తెలుగు సినిమా విషయంలో జరగాలి అంటే ఇక వేరే ఏ సినిమాకి అంత స్టామినా ఉంది? వాస్తవానికి బాహుబలిని ఢీకొట్టే రేంజులో విజువల్స్‌ చూపించాలన్న తాపత్రయంతో గుణశేఖర్‌ 'రుద్రమదేవి 3డి' చిత్రాన్ని 70 నుంచి 80కోట్ల పెట్టుబడితో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఎంతసేపూ టెక్నాలజీని ప్రమోట్‌ చెయ్యడమే కాని మార్కెటింగ్‌ మీద ఫోకస్‌ పెట్టట్లేదు. అక్కడే మనోడికీ రాజమౌళి వ్యత్యాసం ఉంది.

రుద్రమదేవి 3డి కోసం అత్యున్నత సాంకేతికతను ఉపయోగించారు. తొలి స్టీరియోస్కోపిక్‌ 3డి, దేశంలోనే తొలి 3డి బయోపిక్‌ అంటూ టెక్నాలజీపై ప్రచారం ఊదరగొట్టేశారు. కానీ మార్కెట్‌ పరంగా ఈ సినిమాని ఎన్‌క్యాష్‌ చేసుకోవడానికి అవసరమైంది.. టెక్నాలజీకి సంబంధించిన ప్రచారం కాదు.. స్టార్‌డమ్‌, కథాంశం హైలైట్‌ చేస్తూ మార్కెట్‌ పెంచుకునే ఎత్తుగడ కావాలి. ఈ సినిమాకు అరుంధతిగా నటించిన అనుష్క రుద్రమదేవిగా నటించడం పెద్ద బలం. దాన్ని ఏమాత్రం హైలైట్‌ చేయలేదు. అలాగే ఈ చిత్రంలో నటించిన తారాగణంలో క్యాథరిన్‌, నిత్యామీనన్‌ వంటివాళ్లు ఇటీవలి కాలంలో ఫిలింఫేర్‌ సహా పలు అవార్డులు అందుకున్నారు. దాన్నీ ప్రమోట్‌ చేసుకోవట్లేదు.

ఇకపోతే సాయి కొర్రపాటి కృష్ణా జిల్లా హక్కుల్ని కొనుక్కున్నారు అన్నది జనాల్లో ఆసక్తి కలిగించే పాయింటా? కానీ దాన్ని హైలైట్‌ చేస్తూ ప్రచారం చేశారు. దానికంటే అల్లు అర్జున్‌ గోనగన్నారెడ్డిగా నటించినందుకు.. అతడిని ప్రమోషన్‌లో ఇంకా పెద్ద ఎత్తున ఉపయోగించుకునే ఆస్కారం ఉంది. బన్ని కోల్గేట్‌ ప్రకటనతో బాలీవుడ్‌లో ఫేమస్‌ అయిపోయాడు. ఇప్పటికే సౌత్‌ స్కోప్‌ మ్యాగజైన్‌, అవార్డుల ఉత్సవాలతో కోలీవుడ్‌లోనూ అతడు ఫేమస్‌. పైగా బన్ని సినిమాలకు మల్లూ ల్యాండ్‌లో గిరాకీ ఉంది. కాబట్టి గోన గన్నారెడ్డి పేరుతో పొరుగున బోలెడంత ప్రచారం చేసుకోవచ్చు.

అసలు కథా బలంతో నెగ్గుకొస్తానన్న ధీమాని గుణశేఖరుడు ఇంతవరకూ ఏ ప్రచారంలోనూ చూపించలేదు. ఓ హిస్టారికల్‌ 3డి సినిమా తీస్తున్నా అన్నాడు తప్ప కథలో ఆసక్తి రేకెత్తించే పాయింట్లను అస్సలు రెయిజ్‌ చేయనేలేదు. ఎప్పుడో 90ల నాటి పురాతన ప్రచార పంథాని అనుసరిస్తే మార్కెట్‌ని కొల్లగొట్టడం కుదురుతుందా? మార్కెటింగ్‌ ఈజ్‌ ఇంపార్టెంట్‌ సార్‌. రాజమౌళిని చూసి నేర్చుకోండి. ఆయన చేసిన ప్రమోషన్‌ కారణంగానే బాహబులికి వందల కోట్లు వచ్చేస్తున్నాయ్‌.