Begin typing your search above and press return to search.

వర్మపై బూతులు.. గుణశేఖర్ స్పందించాడు

By:  Tupaki Desk   |   18 Nov 2017 1:55 PM GMT
వర్మపై బూతులు.. గుణశేఖర్ స్పందించాడు
X
నంది అవార్డుల ఎంపిక తీరుపై సెటైర్లు వేసిన రామ్ గోపాల్ వర్మ మీద అవార్డుల కమిటీ సభ్యుడు మద్దినేని రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శించడాన్ని దర్శకుడు గుణశేఖర్ తప్పుబట్టాడు. తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన వర్మను పట్టుకుని అలా మాట్లాడటం తనకు ఎంతో బాధ కలిగించిందని గుణశేఖర్ అన్నాడు. దాసరి నారాయణరావు తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు అంత గుర్తింపు తెచ్చి.. ఎందరో వర్ధమాన దర్శకులకు స్ఫూర్తిగా నిలిచిన ఘనత వర్మదే అని గుణశేఖర్ అన్నాడు. ఇప్పుడొచ్చే యువ దర్శకులు కూడా తమకు వర్మ స్ఫూర్తి అని చెబుతారని.. అలాంటి దర్శకుడి మీద మద్దినేని రమేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరకమని.. ఆయన వెంటనే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని గుణశేఖర్ కోరాడు.

ఇక తన మీద వచ్చిన విమర్శల మీదా గుణశేఖర్ స్పందించాడు. ‘‘అసలు ఈ గుణశేఖర్ ఎవరు? రుద్రమదేవి సినిమా వచ్చిన రెండు మూడేళ్లకు పన్ను మిహాయింపు గురించి మాట్లాడుతున్నాడేంటి అని అడుగుతున్నారు. నా వెనుక ఎవరో ఉన్నారంటున్నారు. అలాంటిదేమీ లేదు. నేనెప్పుడూ ఒంటరి వాడినే. నేను పన్ను మినహాయింపుకు ఆలస్యంగా దరఖాస్తు చేసినట్లు ఆరోపిస్తున్నారు. అది కూడా అబద్ధం. నేను సినిమా విడుదల కావడానికంటే ముందే మినహాయింపు కోసం దరఖాస్తు చేశాను. ప్రభుత్వ కార్యదర్శి అజయ్ కల్లాం గారిని కలిసి సరిగ్గానే అప్లికేషన్ ఇచ్చాను. అయ్యన్నపాత్రుడు గారు కూడా నా అప్లికేషన్ చూసి పరిశీలిద్దాం అన్నారు. తర్వాత స్పందించలేదు. ఆ తర్వాత ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు. నా వంతుగా ఎలాంటి ప్రయత్న లోపం లేదు’’ అని గుణశేఖర్ అన్నాడు.’’