Begin typing your search above and press return to search.

ఓటీటీ మినీ రివ్యూ: 'గువ్వ గోరింక'

By:  Tupaki Desk   |   18 Dec 2020 7:02 AM GMT
ఓటీటీ మినీ రివ్యూ: గువ్వ గోరింక
X
టాలీవుడ్ లో వైవిధ్యభరిత సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్. కరోనా లాక్ డౌన్ లో రెండు సినిమాలను డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా మూడో సినిమా ''గువ్వ గోరింక'' ను కూడా ఓటీటీలో రిలీజ్ చేశారు. దాదాపు మూడేళ్ల క్రితం పూర్తైన ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేసి ఇన్నాళ్లకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఓటీటీ స్టార్ హీరోగా వెలుగొందుతున్న సత్యదేవ్ నటించిన 'గువ్వ గోరింక' సినిమా ఎలా ఉందో చూద్దాం!

కథ విషయానికొస్తే మెకానికల్ ఇంజినీరింగ్ లో పీహెడీ చేస్తున్న సదానంద్(సత్యదేవ్) శబ్దం అంటే ఇష్టం ఉండదు. సౌండ్ అంటూ రాని ఒక ఇంజిన్ ని కనుక్కోవాలని సదా ప్రయత్నిస్తుంటాడు. ఇక హీరోయిన్ శిరీష(ప్రియా లాల్) తన సంగీత సాధనలో మాస్టర్స్ చెయ్యాలని సంగీత విధ్వాంసురాలు అవ్వాలనే ఆశయంతో జీవిస్తూ ఉంటుంది. అయితే నిప్పు - నీరు వంటి భిన్న స్వభావాలు కలిగిన వీరిద్దరూ పక్కపక్క ఫ్లాట్స్ లోనే ఉంటూ ఒకరినొకరు చూసుకోకుండానే గొడవలు నుంచి స్నేహం వరకు సాగుతుంది. సంగీతమే ప్రాణమైన ఓ అమ్మాయికి, సౌండ్ అంటేనే పడని ఓ అబ్బాయికి మధ్య జరిగే కథే 'గువ్వ గోరింక'.

రామ్ గోపాల్ వర్మ దగ్గర 'సర్కార్' నుంచి 'రక్త చరిత్ర' వరకు అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన మోహన్ బమ్మిడి 'గువ్వ గోరింక' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆకార్ మూవీస్ బ్యానర్ పై జీవన్ రెడ్డి - దాము సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వినటానికి ఆసక్తికరమైన పాయింట్ తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందనే టాక్ వినిపిస్తోంది. ట్రైలర్ లోనే సినిమా నేపథ్యాన్ని వెల్లడించిన మేకర్స్.. ప్రేక్షకుడు మొత్తం సినిమా చూసేలా రూపొందించలేకపోయారు. కథా కథనంలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం.. పెద్ద చెప్పుకోదగిన స్థాయిలో సన్నివేశాలు లేకపోవడం అనేవి ఓటీటీ ఆడియన్స్ సహానికి పరీక్ష పెట్టాయని తెలుస్తోంది. లఘు చిత్రానికి సరిపడే స్క్రిప్ట్ కి బలవంతంగా కామెడీ ట్రాక్స్ జోడించి.. అసలు కెమిస్ట్రీ లేని ఇద్దరి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ మధ్య నాలుగైదు సిల్లీ సీన్స్ జత చేసినట్లుగా ఉందని ప్రేక్షకులు ఫీడ్ బ్యాక్ ఇచ్చేసారు. అయితే ఓటీటీలో రిలీజ్ కాబట్టి ఫార్వార్డ్ చేసే అవకాశం ఉండటం కాస్త ఉపశమనం కలిగించే అంశమని అంటున్నారు.

నటీనటుల విషయానికొస్తే టాలెంటెడ్ హీరో సత్యదేవ్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ లో మంచి నటన కనబరిచాడు. అలాగే ఎప్పటిలాగే తన డైలాగ్ డెలివరీ ఈ చిత్రంలో కూడా మన్ననలు పొందుతోంది. అయితే షూటింగ్ కి ఎక్కువ గ్యాప్ వచ్చిందేమో సత్యదేవ్ లుక్ లో వేరియేషన్ కనిపించింది. ఇక హీరోయిన్ ప్రియ ఉన్నంతలో తన రోల్ కు న్యాయం చేసింది. అలాగే హాస్యనటులు ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ తమ కామెడీతో సినిమాని లేపే ప్రయత్నం చేశారు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే ఈ చిత్రంలో అంతో ఇంతో చెప్పకోవాల్సింది వారి గురించే. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి మంచి సంగీతం మరియు నేపథ్య సంగీతం సమకూర్చారు. ఆర్ట్ డిపార్టమెంట్ సాంబశివరావు కష్టం తెర మీద కనపడుతుంది. మైలేసం రంగస్వామి సినిమాటోగ్రఫీ కూడా నీట్ గా ఉంది. జగదీశ్వరరావు డైలాగులు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ ఏమాత్రం బాలేదు. చాలా వరకు సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. మోహన్ బమ్మిడి దర్శకత్వం వరకు బాగానే ఉందని అనిపించినా కథలో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారనే చెప్పాలి. మొత్తం మీద సత్యదేవ్ నటన.. నేపథ్య సంగీతం.. ఆర్ట్ మినహాయిస్తే ఈ చిత్రంలో చెప్పుకోడానికి పెద్దగా ఏమీ లేదని చెప్పవచ్చు.