Begin typing your search above and press return to search.

తెలుగులోకొచ్చిన 'అరబిక్ కుత్తు - హలమిత్తి హబీబో'

By:  Tupaki Desk   |   4 April 2022 11:48 AM GMT
తెలుగులోకొచ్చిన అరబిక్ కుత్తు - హలమిత్తి హబీబో
X
తమిళ స్టార్ హీరో విజయ్ - పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'బీస్ట్'. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

'మాస్టర్' సినిమాతో విజయ్ బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఇప్పుడు ''బీస్ట్'' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా 'హలమితి హబీబో' తెలుగు లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు.

తమిళ్ లో 'అరబిక్ కుత్తు - హలమితి హబీబో' పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో 260 మిలియన్లకు పైగా వ్యూస్.. 55 లక్షలకు పైగా లైక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మరోవైపు సాధారణ ప్రేక్షకుల నుంచి సెలెబ్రిటీస్ వరకు అందరూ అరబిక్ కుతు రీల్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ కంపోజ్ చేసిన ఈ పాటకు హీరో శివ కార్తికేయన్ లిరిక్స్ అందించడం విశేషం. నెట్టింట సంచలనం సృష్టిస్తోన్న ఈ సాంగ్ ను ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చారు.

'హలమిత్తి హబీబో హలమితి విన్నా.. హలమిత్తి హబీబో హలమితి విన్నాలే..' అంటూ వచ్చిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. తెలుగులో శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ రాశారు. ఒరిజినల్ వెర్సన్ ట్యూన్ కు మ్యాచ్ అయ్యేలా పదాలు సమకూర్చే ప్రయత్నం చేశారు. అనిరుధ్ రవిచంద్రన్ మరియ జోనితా గాంధీ ఎంతో హుషారుగా అలపించారు.

జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో విజయ్ - పూజా హెగ్డే జంట వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే తెలుగులో పలు పాటలు పాడి అలరించిన అనిరుధ్.. ఇప్పుడు 'అరబిక్ కుత్తు - హలమితి హబీబో' పాటతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇకపోతే 'బీస్ట్' చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించారు. ఆర్. నిర్మల్ ఎడిటింగ్ వర్క్ చేసారు.