Begin typing your search above and press return to search.

సన్నివేశం డిమాండ్ చేసింది కాబట్టే

By:  Tupaki Desk   |   12 Feb 2017 6:02 AM GMT
సన్నివేశం డిమాండ్ చేసింది కాబట్టే
X
తెరమీద మద్యం తాగే సన్నివేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. కొందరు ఇలాంటి సన్నివేశాల వల్ల యూత్ చెడిపోతుందంటారు. ఇంకొందరు సినిమా వాళ్లకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేకుంటే ఎలా.. ఆమాటకొస్తే చాలా నిషేధించాల్సి ఉంటుంది అంటారు. ఈ చర్చ ఎప్పుడూ ఉండేదే కానీ.. తెరమీద అమ్మాయిలు మందు కొట్టినట్లు చూపిస్తే మాత్రం అందరికీ అభ్యంతరకరంగానే ఉంటుంది. ఇలాంటి సన్నివేశాలపై చాలా వ్యతిరేకత వస్తూ ఉంటుంది. ఈ మధ్య హన్సిక ‘బోగన్’ సినిమా కోసం చేసిన ఆ తరహా సీన్ పై తమిళనాట తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సీన్ సహజంగా పండాలని హన్సిక నిజంగానే మందు కొట్టి నటించినట్లు కూడా వార్తలొచ్చాయి.

ఇదే విషయమై హన్సికను ప్రశ్నిస్తే.. ఆ సన్నివేశం ప్రాధాన్యతను వివరించింది. సినిమాకు చాలా అవసరం కాబట్టే ఆ సీన్ చేశానని తెలిపింది. ‘‘ఇంతకుముందు కొన్ని సినిమాల్లో మద్యం తాగే సన్నివేశాల్లో నటించమని అడిగినా కాదన్నాను. కానీ ‘బోగన్’లో కథకు అవసరం కాబట్టే అలాంటి సీన్లో చేయాల్సి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే కథానాయికకు ఇష్టం లేని పెళ్లి చేయాలనుకుంటాడు తండ్రి. నిశ్చితార్థ ఏర్పాట్లు కూడా చేస్తాడు. దీంతో ఆ నిశ్చితార్థం చెడ గొట్టాలని హీరోయిన్ అనుకుంటుంది. ధైర్యం కోసం చీప్ లిక్కర్ కొనుక్కుని వెళ్లి ఫ్రెండు ఇంట్లో తాగేసి.. తనకీ పెళ్లి ఇష్టం లేదని తన తండ్రికి చెప్పాలనుకుంటుంది. కానీ మధ్యలో పోలీసులకు దొరికి పోవడంతో ఆమె ప్లాన్ ఫెయిలవుతుంది. స్వతహాగా నేను మద్యం తాగడానికి వ్యతిరేకిని. కానీ ఈ సన్నివేశం డిమాండ్ చేసింది కాబట్టే అలా నటించా’’ అని చెప్పింది హన్సిక.