Begin typing your search above and press return to search.

ఒక్క దెబ్బ‌కు పాన్ వ‌ర‌ల్డ్‌ హీరో అయ్యాడు!

By:  Tupaki Desk   |   11 Jan 2023 1:30 AM GMT
ఒక్క దెబ్బ‌కు పాన్ వ‌ర‌ల్డ్‌ హీరో అయ్యాడు!
X
ఇటీవ‌ల తెలుగు స్టార్ల‌పై బాలీవుడ్ మీడియా ఫోక‌స్ విప‌రీతంగా పెరిగింది. బాహుబ‌లి ఫ్రాంఛైజీ ఘ‌న‌విజ‌యం త‌ర‌వాత పుష్ప‌- ఆర్.ఆర్.ఆర్- కార్తికేయ 2 హిందీలోను బాగా ఆడాయి. ఉత్త‌రాది వారికి ఇప్పుడు ద‌క్షిణాది సినిమా పిచ్చి ప‌ట్టుకుంది. అక్క‌డ మ‌సాలా కంటెంట్ కి ఊపు పెరిగింద‌ని చెప్పాలి. గ‌డిచిన రెండు మూడేళ్ల‌తో పోలిస్తే ఇప్పుడు తెలుగు సినిమా ఇమేజ్ జాతీయ అంత‌ర్జాతీయ య‌వ‌నిక‌పై పెరిగింది. టాలీవుడ్ లో చిన్న హీరో అయినా స‌రైన కంటెంట్ ఉన్న సినిమాలో న‌టిస్తే నేటి టెక్నాల‌జీని అందిపుచ్చుకుని అదృష్టం క‌లిసొస్తే పాన్ ఇండియా లో కొట్టేయొచ్చు..

ఇంత‌కుముందులా ప్రాంతీయ త‌త్వం కుల‌త‌త్వం ఆ న‌లుగురు త‌త్వం ఇక ఎవ‌రినీ ఆప‌దు. అలాంటి పీడ‌లేవీ లేవ్ అని అర్థ‌మ‌వుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ తేజ స‌జ్జా అంటే ఎవ‌రో అంద‌రికీ తెలియ‌దు. ఇరుగు పొరుగు భాష‌ల్లో అత‌డి ప్ర‌వేశం లేదు. ఇంకా అత‌డు ఈ రంగంలో ఒక కిడ్ మాత్ర‌మే. కానీ ఇంత‌లోనే హ‌ను-మాన్ తో పాన్ ఇండియా కేట‌గిరీలో ప‌రిచ‌య‌మైపోతున్నాడు. టీజర్ కి వచ్చిన స్పంద‌న‌ను చూసి ద‌ర్శ‌క‌ నిర్మాతలు సినిమా స్థాయిని పెంచి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. హను-మాన్ 12 మే 2023 తేదీన‌ తెలుగు- హిందీ- మరాఠీ- తమిళం- కన్నడ- మలయాళం- ఇంగ్లీష్- స్పానిష్- కొరియన్- చైనీస్- జపనీస్ సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్ లెవ‌ల్లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

ఈ సినిమా క‌థాంశం చాలా ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అలాగే టీజ‌ర్ పోస్ట‌ర్లు స‌హా ప్ర‌తిదీ క్యూరియాసిటీని పెంచాయి. దీంతో ఇప్పుడు తేజ స‌జ్జా న‌క్క తోక తొక్కాడ‌న్న చ‌ర్చా సాగుతోంది. అత‌డికి ఇరుగు పొరుగు రాష్ట్రాల‌లోనే కాదు.. ఇత‌ర దేశాల‌లోను ఐడెంటిటీ ద‌క్కుతుంది రిలీజ్ స‌వ్యంగా సాగితే.. జాతీయ అంత‌ర్జాతీయ స్థాయిలో పాపులారిటీ కొట్టేస్తాడు. హ‌నుమాన్ పాన్ ఇండియా/ పాన్ వ‌ర‌ల్డ్ లో కొట్టేస్తుందా లేదా? అన్న‌ది అటుంచితే తేజ స‌జ్జా అనే ఒక యంగ్ హీరో టాలీవుడ్ లో ఉన్నాడ‌ని ప్ర‌పంచం మొత్తం తెలిసిపోవ‌డం గ్యారెంటీ.

తేజ స‌జ్జా లాంటి అప్ కం హీరోతో ఏకంగా ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ హను-మాన్ ని ప్రారంభించ‌డం ఒక సాహ‌సం కాగా ఇప్పుడు అది టాక్ ఆఫ్ ది టౌన్ గా మార‌డం ఆస‌క్తిని పెంచింది. ఇప్ప‌టికే ఈ యూనివ‌ర్శ్ నుంచి మొదటి చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవ‌ల రిలీజైన‌ టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. అద్భుతమైన విజువల్స్.. దానికి త‌గ్గ నేప‌థ్య‌ సంగీతంతో క్యూరియాసిటీని పెంచింది.

హనుమంతుని గంభీరమైన విగ్రహాన్ని బహిర్గతం చేసే మొదటి షాట్ నుండి హిమాలయాలలోని ఒక గుహలోకి ప్రవేశించిన కెమెరా చివరి షాట్ వరకు `రామ్.. రామ్..` అని జపిస్తూ శివలింగం వంటి మంచు ఆకారంలో ఉన్న మంచులో హనుమంతుడు ధ్యానం చేస్తున్నాడని వెల్లడించడం వరకు టీజ‌ర్ ఆద్యంతం అద్భుతం అని ప్ర‌పంచం అంగీక‌రించింది.

తెలుగు సినిమాకి జాంబీస్ ని పరిచయం చేసిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో మొదటి సూపర్ హీరో మూవీని తెర‌కెక్కించ‌డం కూడా ఆస‌క్తిని పెంచుతోంది. హను-మాన్ తప్పనిసరిగా `అంజనాాద్రి` అనే ఊహాలోకంలో విహ‌రింప‌జేస్తుంద‌ని అంతా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. క‌థానాయకుడు హనుమంతుని శక్తులను పొంది అంజనాద్రి కోసం ఎలా పోరాడాడనేది ఈ చిత్ర కథాంశంగా తెలుస్తోంది. సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్ గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించే అవకాశం ఉందని అంచ‌నా వేస్తున్నారు. ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా వినయ్ రాయ్ విలన్ గా న‌టిస్తున్నాడు. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ ప‌తాకంపై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అస్రిన్ రెడ్డి.. లైన్ ప్రొడ్యూసర్ గా వెంకట్ కుమార్ జెట్టి.. అసోసియేట్ ప్రొడ్యూసర్ గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.