Begin typing your search above and press return to search.

అందానికే అందం .. అనసూయ!

By:  Tupaki Desk   |   15 May 2021 9:00 AM IST
అందానికే అందం .. అనసూయ!
X
బుల్లితెరపైకి ఎంతోమంది యాంకర్లు వచ్చారు .. వెళ్లారు. కానీ అనసూయ అలా కాదు .. యాంకరింగ్ పరంగా .. గ్లామర్ పరంగా తనదైన ప్ర్రత్యేకతను చాటుకుంది. స్టేజ్ పై గలగలా మాట్లాడేస్తూ అందాలను .. హావభావ విన్యాసాలను ఆవిష్కరించే తీరుకు కుర్ర ప్రేక్షకులకు కుదురులేకుండా పోతుంటుంది. బుల్లితెరకి గ్లామర్ టచ్ ఇచ్చిన యాంకర్ అనసూయ అనే చెప్పాలి. అలాగే ఒక యాంకర్ కి గ్లామరస్ హీరోయిన్ స్థాయి క్రేజ్ ను తీసుకొచ్చిన ఘనత కూడా అనసూయకే దక్కిందని ఒప్పుకోవాలి.

అనసూయ మంచి పొడగరి .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. అందువలన మోడ్రెస్ లు వేసినా .. చీరకట్టినా చాలా అందంగా .. ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే అనసూయ హోస్ట్ గా వ్యవహరించే స్టేజ్ పై ఆమెతో పాటు కనిపించడానికి కొంతమంది హీరోయిన్లు వెనకాడతారు. ఎందుకంటే కాస్ట్యూమ్స్ విషయంలో ఆమె హీరోయిన్లతో పోటీపడుతూ ఉంటుంది. హీరోయిన్లపై ఉండవలసిన కెమెరా కళ్లు అనసూయ చుట్టూనే ప్రదక్షిణలు చేస్తూ ఉంటాయి.

ఈ క్రేజ్ కారణంగానే అనసూయను వెతుక్కుంటూ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 'సోగ్గాడే చిన్నినాయనా' .. 'క్షణం' వంటి సినిమాలు అనసూయ అభినయానికి అద్దం పడతాయి. ఇక 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మత్త'గా అనసూయ చేసిన సందడిని ప్రేక్షకులు అలా గుర్తుపెట్టేసుకున్నారు. 'విన్నర్' సినిమాలో ఆమెపై 'సూయా సూయా .. అనసూయ' అంటూ హీరో కాంబినేషన్లో ఒక స్పెషల్ సాంగ్ ను పెట్టారంటే ఆమె క్రేజ్ ఎంతలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు.

'రంగస్థలం' సినిమా నుంచి అనసూయకు అవకాశాలు పెరిగిపోతూ వస్తున్నాయి. అయినా బుల్లితెరను విడిచిపెట్టకుండా, తనకి నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ వెళుతోంది. ముఖ్యమైన పాత్రలకు .. మంచి క్రేజ్ వస్తుందని భావించిన ప్రత్యేక గీతాలకు ఆమె ప్రాధాన్యతనిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో 'ఆచార్య' .. 'పుష్ప' .. 'ఖిలాడి' వంటి పెద్ద సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు కెరియర్ పరంగా తనని మరోమెట్టుపై ఉంచుతాయని అనసూయ భావిస్తోంది. ఈ రోజున ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ, మరిన్ని మంచి పాత్రలతో అలరించాలనీ .. మరెన్నో విజయాలను అందుకోవాలని కోరుకుందాం!