Begin typing your search above and press return to search.

మ్యూజిక్ మాయాజాలం .. మణిశర్మ (బర్త్ డే స్పెషల్)

By:  Tupaki Desk   |   11 July 2021 4:30 AM GMT
మ్యూజిక్ మాయాజాలం .. మణిశర్మ (బర్త్ డే స్పెషల్)
X
ఒక సినిమాకి కథాకథనాలు ఎలాంటివైనా పాట ప్రాణవాయువులా పనిచేస్తుంది. ప్రేక్షకుల మనసుకు రెక్కలు తొడిగేసి, అనుభూతుల ఆకాశంలోకి ఎగరేస్తుంది. అప్పటివరకూ కదలకుండా కూర్చుని కథను ఫాలో అవుతున్న ఆడియన్స్ కి ఉత్సాహమనే ఊపిరి పోస్తుంది. ఆ తరువాత మళ్లీ కాస్త చురుకుగా కథను అనుసరించే ఉత్తేజాన్ని పాట అందిస్తుంది. అందుకే సినిమాలో ప్రతి అరగంటకు ఒక పాట పలకరిస్తుంది .. మంచి ఎనర్జీ కోసం ఔషధాన్ని అందించేసి వెళుతూ ఉంటుంది. అందుకే పాటకి అంతటి ప్రత్యేకత .. ప్రాధాన్యత.


ప్ర్రేక్షకుల హృదయాలను పాట అంతటి గాఢంగా పెనవేసుకుపోయింది కనుకనే, దానిని విడిపించుకుని వెళ్లడానికి కథలు సాహసం చేయడం లేదు. కథ ఒంటరిదైపోకుండా ఎంతోమంది సంగీత దర్శకులు తమ పాటలను తోడుగా చేసి పంపుతూనే ఉన్నారు. ఆ వరుసలో ఇళయరాజా .. రాజ్ కోటీ .. కీరవాణి తరువాత వినిపించిన పేరు 'మణిశర్మ'. తనకి ముందున్న ముగ్గురు సంగీత దర్శకుల దగ్గర నుంచి, పాట స్వరూప స్వభవాలు ఎలా ఉండాలనేది ఆయన పట్టేశారు .. పడుచు మనసులను పాట కొయ్యకు కట్టేశారు.


మణిశర్మ పూర్తి పేరు .. 'యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ' .. కృష్ణ జిల్లా మచిలీపట్నంలో ఆయన జన్మించారు. ఆయన పెరిగిందంతా మద్రాసులోనే. ఊహతెలిసిన దగ్గర నుంచే మణిశర్మ మనసు సంగీతం వైపుకు లాగుతూ వచ్చింది. ఒక వైపున కర్ణాటక సంగీతం .. మరో వైపున పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నారు. అంతేకాదు మాండొలిన్ .. గిటార్ .. కీ బోర్డును ప్లే చేయడంలో ఆయన ఎంతో నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. ఇలా ఆయన చాలా చిన్నవయసులోనే సినిమా సంగీతంపై పట్టు సాధించారు.


కీరవాణి దగ్గర పనిచేస్తున్న సమయంలోనే ఆయనకి రామ్ గోపాల్ వర్మ అవకాశం ఇచ్చారు. అలా ఆయన 'రాత్రి' .. 'అంతం' సినిమాలకు పనిచేశారు. ఆ తరువాత చేసిన ప్ర్రేమించుకుందాం రా' .. 'బావగారూ బాగున్నారా' సినిమాలు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. 'సమరసింహరెడ్డి' ... 'చూడాలనివుంది'లోని పాటలు ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపేశాయి. ఫాస్టు బీట్ తో మాస్ ఆడియన్స్ లో పూనకాలు తెప్పించడం .. మెలోడీతో క్లాస్ ఆడియన్స్ మనసులకు మంచి గంధం రాయడంలో ఆయన తనదైన ముద్రను చూపించారు.


ఈ సినిమాలలోని 'అలా చూడు ప్రేమలోకం' .. 'నవమి దశమి ' .. 'యమహా నగరి' .. 'అందాల ఆడబొమ్మ' వంటి మెలోడీలు ఆయనకు 'మెలోడీ బ్రహ్మ' అనే బిరుదును తెచ్చిపెట్టాయి. కథ ఏదైనా అన్ని వర్గాల ప్రేక్షకులు ఒకే సమయంలో థియేటర్లో ఉంటారు గనుక, అందరినీ మెప్పించేలా చూడటానికి ఆయన తనవంతు ప్రయత్నం చేసేవారు. అందువల్లనే ఫాస్టు బీట్లు .. మెలోడీలు .. జానపద బాణీలను సమాకూర్చుతూ సినిమాను ఒక పండుగలా .. ఉత్సవంగా మార్చడానికి తపిస్తూ ఉంటారు.


ఇలా ఆయన మాంఛి జోరు మీద ఉన్నప్పుడే దేవిశ్రీ ప్రసాద్ నుంచి తమన్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయినా ఆ పోటీని తట్టుకుని ఆయన నిలబడ్డారు. ఏ హీరోకి ఎలాంటి ఇమేజ్ ఉంది? .. ఎవరికి ఏ తరహా ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు? .. వాళ్లు తమ హీరో సినిమా నుంచి ఎలాంటి పాటలను కోరుకుంటారు? అనే విషయంపై ఆయనకి గల అవగాహన .. అనుభవమే అందుకు కారణమని చెప్పాలి. ఇప్పుడు కూడా ఆయన చేతిలో 'ఆచార్య' .. 'లైగర్' .. 'శాకుంతలం' వంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. వాటితో ఆయన చేయనున్న సందడి కోసం అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు మణిశర్మ పుట్టినరోజు .. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నుంచి మరిన్ని మధుర గీతాలు రావాలని కోరుకుందాం.