Begin typing your search above and press return to search.

అందానికి అందం .. నిధి అగర్వాల్ (బర్త్ డే స్పెషల్)

By:  Tupaki Desk   |   17 Aug 2021 4:05 AM GMT
అందానికి అందం .. నిధి అగర్వాల్ (బర్త్ డే స్పెషల్)
X
తెలుగు తెర అందమైన కథానాయికల అక్షయపాత్రలా కనిపిస్తుంది. ఈ తెరపై నుంచి ఒకరి తరువాత ఒకరిగా అప్సరసల్లాంటి భామలు వస్తూనే ఉంటారు. వయసుకొచ్చిన కుర్రాళ్లను థియేటర్ల చుట్టూ తిప్పుతూనే ఉంటారు. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన హీరోయిన్లలో, పౌర్ణమి రోజున ఆకాశంలో నుంచి జారిపడిన జాబిలమ్మలా నిధి అగర్వాల్ కనిపిస్తుంది. 'సవ్యసాచి' సినిమా చూసినవారు, నవనిధులకు మరో నిధి తోడైందనుకున్నారు. అద్దం కంటే ఆమె ఫేస్ బుక్ నే ఎక్కువగా చూస్తున్నారు .. ఆరాధనలో ఆకలిని మరిచిపోతున్నారు.

నెమలి మేను లోని తళుకులు .. హంస నడకలోని కులుకులు ఈ అమ్మాయిలో చూసిన కుర్రాళ్లంతా,ఆ థియేటర్లోనే పెరిగి పెద్ద వాళ్లై పోవాలనుకున్నారు. అంతగా ఆమె తన అందచందాలతో ప్రభావం చూపించింది కనుకనే, 'మిస్టర్ మజ్ను' సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమా కూడా ఆశించినస్థాయిలో ఆడలేదు. కథకి ఆమె అందాన్ని తెచ్చిందేగాని అడ్డుపడలేదు కదా? అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేయడంతో. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో అవకాశం దక్కింది. ఈ సినిమాలో ఈ పిల్ల చేసిన అందాల అల్లరి చూసిన వాళ్లకి కోలుకోవడానికి కొంతకాలం పట్టింది.

తెలుగు తెరపై చేపపిల్లలాంటి అమ్మాయి తళుక్కున మెరుస్తుందని తెలియగానే కోలీవుడ్ వాళ్లు పరిగెత్తుకు వచ్చారు. ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా శింబు .. జయం రవి వంటి హీరోల జోడీగా అవకాశం ఇచ్చారు. ఇతర హీరోలు కూడా తమ సినిమాలకు ఆమెను సిఫార్స్ చేస్తున్నారు. అక్కడ ఆమె జోరు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెకి పవన్ సినిమా నుంచి ఛాన్స్ వచ్చింది. 'హరిహర వీరమల్లు' సినిమాలో ఆయన ప్రియురాలిగా కనిపించనుంది. మొగల్ కాలం నాటి కాస్ట్యూమ్స్ లో ఈ అమ్మాయి మరింత అందంగా మెరవనుందని అంటున్నారు.

ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో నిధి అగర్వాల్ దూకుడు పెరగవచ్చనే టాక్ వినిపిస్తోంది. నటన విషయంలో ఈ అమ్మాయి తనని తాను సరిచేసుకుంటే, రష్మిక .. పూజ హెగ్డేలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంచెం లౌక్యం ఉంటే అంతా అనుకున్న బాటలో అడుగుపెట్టడానికి ఈ అమ్మాయికి పెద్ద సమయం పట్టకపోవచ్చును. ఈ రోజున ఈ అందాల మందారం పుట్టినరోజు .. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వరుస అవకాశాలతో దూసుకెళ్లాలని కోరుకుందాం.