Begin typing your search above and press return to search.

తెలుగు తెరపై విరిసిన దరహాసం .. సుహాసిని (బర్త్ డే స్పెషల్)

By:  Tupaki Desk   |   15 Aug 2021 5:30 AM GMT
తెలుగు తెరపై విరిసిన దరహాసం .. సుహాసిని (బర్త్ డే స్పెషల్)
X
తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన నిన్నటితరం కథానాయికలలో సుహాసిని ఒకరు. పేరుకి తగినట్టుగానే తెరపై ఆమె ఒక అందమైన దరహాసమై విరిసింది .. వెన్నల ధారలై కురిసింది. నాజూకైన ఆమె అందానికీ .. నాణ్యమైన నవ్వుకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. పదహరణాల పల్లెపిల్లలా పరికిణీల్లోను .. పద్ధతిగల ఇల్లాలుగా చీరకట్టులోను .. కలవారి అమ్మాయిలా మోడ్రన్ డ్రెస్ లలోను ఆమె ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టేశారు.

సినిమాల్లో హీరోయిన్ గా రాణించాలంటే ముందుగా అందాలను ఆరబోయాలి. స్టార్ డమ్ వచ్చేదాకా ఇలాంటి పరిస్థితి దాదాపు అందరికీ ఎదురవుతూనే ఉంటుంది. కానీ సుహాసిని ఏ సినిమాలోను తన పరిధిని దాటేసిన దాఖలాలు కనిపించవు. కేవలం అందం .. అభినయం .. మంత్రముగ్ధులను చేసే నవ్వుతోనే ఆమె తన కెరియర్ ను నెట్టుకొచ్చారు. ఇక ఆమె వాయిస్ కూడా ప్ర్రత్యేకంగా అనిపిస్తూ ఆకట్టుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ మనసులను సైతం దోచేసుకుంది.

తెలుగులోకి ఆమె అడుగుపెడుతూనే 'మంచు పల్లకీ'తో తొలి హిట్ ను అందుకున్నారు. ఈ సినిమాలో సుహాసిని అందచందాలు చూసిన ప్రేక్షకులంతా, ఆమె ఆరాధకులుగానే థియేటర్లలో నుంచి బయటికి వచ్చారు. ఆ తరువాత చిరంజీవితో ఆమె చేసిన సినిమాల్లో చాలావరకూ విజయ విహారం చేశాయి. ఛాలెంజ్ ... ఇంటిగుట్టు .. చంటబ్బాయ్ .. రాక్షసుడు సినిమాలు ఆమె కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచాయి.

ఇక బాలకృష్ణతో కూడా ఆమె ఎక్కువ సినిమాలే చేశారు. ఆయనతో గ్రామీణ నేపథ్యంలో గల సినిమాలను ఆమె ఎక్కువగా చేశారు. ముల్లుగర్ర చేతబట్టిన పల్లెటూరి బుల్లోడుగా బాలకృష్ణ ఉంటే, ఆయనను ముగ్గులోగి దింపే కోమలాంగిలా సుహాసిని అలరించారు. ఆ జాబితాలో 'మంగమ్మగారి మనవడు' .. 'ప్రెసిడెంట్ గారి అబ్బాయి' .. ' బాలగోపాలుడు' వంటి సూపర్ హిట్లు కనిపిస్తాయి. ఇటు చిరూతోను .. అటు బాలయ్యతోను ఆమె హిట్ పెయిర్ గా నిలవడం విశేషం.

వెంకటేశ్ జోడీగా 'వారసుడొచ్చాడు' .. నాగార్జున సరసన 'ఆఖరి పోరాటం' చేసిన ఆమె, అప్పటికే సీనియర్ హీరో అయిన శోభన్ బాబుతో వరుస సినిమాలు చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ జంటకు ప్రేక్షకులలో విశేషమైన ఆదరణ లభించింది కూడా. శోభన్ బాబు సరసన నాయికగా ఆమె నటించిన ఇల్లాలు ప్రియురాలు .. కొంగుముడి ... జాకీ .. మహారాజు భారీ విజయాలను సాధించాయి. ముఖ్యంగా ఈ జంటకు మహిళా ప్రేక్షకుల నుంచి విశేషమైన మద్దతు లభించింది.

ఒక వైపున విజయశాంతి .. రాధ ... భానుప్రియ వంటి నాయికల పోటీని తట్టుకుని నిలబడుతూ, నాయిక ప్ర్రదామైన కథలతోను విజయాలను సొంతం చేసుకోవడం ఆమె ప్రత్యేకతగానే చెప్పుకోవాలి .. ఒప్పుకోవాలి. స్వాతి .. స్రవంతి .. గౌతమి .. లాయర్ సుహాసిని వంటి సినిమాలు నటిగా ఆమె క్రేజ్ ను మరింత పెంచాయి. అసమానమైన ఆమె అభినయానికి కొలమానమై నిలిచాయి.

దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు కథానాయికగా అలరించిన సుహాసిని, ఆ తరువాత నుంచి కేరక్టర్ ఆర్టిస్టుగా తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఆమె చేతిలో మూడు నాలుగు తెలుగు సినిమాలు ఉన్నాయి. అప్పుడైనా .. ఇప్పుడైనా తెరపై సుహాసిని కనిపిస్తే ఒక నిండుదనం .. పండుగదనం .. అంతే. ఈ రోజున ఆమె పుట్టినరోజు .. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం.