Begin typing your search above and press return to search.

హరికృష్ణ పాత్రను పెంచుతున్నారా?

By:  Tupaki Desk   |   1 Sep 2018 8:47 AM GMT
హరికృష్ణ పాత్రను పెంచుతున్నారా?
X
నందమూరి హరికృష్ణ హఠాన్మరణం తాలూకు విషాదం ఇంకా తెలుగు జనాల్ని వీడిపోలేదు. ఇలాంటి కష్ట కాలంలో హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్.. జూనియర్ ఎన్టీఆర్ లకు నందమూరి.. నారా కుటుంబాలు బాగానే సపోర్టిచ్చే ప్రయత్నం చేసినట్లుగా కనిపించాయి గత రెండు మూడు రోజుల పరిణామాలు. కొన్నేళ్లుగా హరికృష్ణ కుటుంబానికి దూరం దూరంగా ఉంటున్న బాలకృష్ణ.. తన అన్న మరణించిన సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచారు. అంత్యక్రియలకు ముందు తర్వాత అన్నీ తానై వ్యవహరించారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాతి రోజు భోజనం చేస్తూ కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ లతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించాడు బాలయ్య. మొత్తంగా హరికృష్ణ మరణం తర్వాత కష్ట కాలంలో వీరి మధ్య అనుబంధం కనిపించడం నందమూరి అభిమానులకు ఆనందాన్నిచ్చింది.

ఇక నందమూరి కాంపౌండ్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ జీవిత కథతో తెరకెక్కుతున్న ‘యన్.టి.ఆర్’ సినిమాలో హరికృష్ణ పాత్రను పెంచుతున్నారట. గత పరిస్థితుల ప్రకారం హరి పాత్రను చాలా సింపుల్ గా తేల్చేయాలని.. ఆయన పాత్ర అంతగా ఎలివేట్ కాకూడదన్న ఆలోచనతో బాలయ్య ఉండేవాడని.. కానీ అన్న మరణం నేపథ్యంలో ఆయన ఆలోచన మారిపోయిందని అంటున్నారు. ప్రేక్షకులు కూడా ఈ పాత్రతో ఇప్పుడు ఎమోషనల్ గా కనెక్టయ్యే అవకాశముండటంతో దాని నిడివి.. ప్రాధాన్యం పెంచాలని బాలయ్య అండ్ టీం డిసైడయ్యారని.. రచయితలతో కలిసి క్రిష్ హరితో ముడిపడ్డ సన్నివేశాలపై వర్క్ చేస్తున్నాడని సమాచారం. ఈ చిత్రంలో హరికృష్ణ పాత్రను కళ్యాణ్ రామే చేయబోతున్నట్లు కూడా ఖరారైంది. తండ్రి పాత్రకు తగ్గట్లుగా తన ఆహార్యాన్నిమార్చుకోవడానికి కూడా కళ్యాణ్ రామ్ సిద్ధమవుతున్నాడట. త్వరలోనే కళ్యాణ్ రామ్ షూటింగుకి హాజరవుతాడని.. దాదాపు నెల రోజుల పాటు అతడితో షెడ్యూల్ ఉంటుందని అంటున్నారు.