Begin typing your search above and press return to search.

రామ్ తో త్వరలో సినిమా చేస్తా: హరీశ్ శంకర్

By:  Tupaki Desk   |   11 July 2022 9:18 AM GMT
రామ్ తో త్వరలో సినిమా చేస్తా: హరీశ్ శంకర్
X
ఉస్తాద్ హీరో రామ్ పోతినేనితో తప్పకుండా సినిమా చేస్తానని దర్శకుడు హరీష్ శంకర్ ప్రకటించారు. 'ది వారియర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు టాలీవుడ్ మాస్ డైరెక్టర్.

రామ్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కించిన సినిమా ''ది వారియర్''. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

దీనికి హరీశ్ శంకర్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ది వారియర్' ట్రైలర్ తనకు బాగా నచ్చిందని అన్నారు. తనకు ఎంతో ఇష్టమైన దర్శకులలో లింగుస్వామి ఒకరని.. ఆయన స్టైలిష్ అండ్ మాస్ కలబోసిన ఏకైక డైరెక్టర్ అని హరీశ్ పేర్కొన్నారు.

ఇంకా హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. ''నేను 'దేవదాస్' నుంచి రామ్ కు ఫ్యాన్ ని. ఎన్నిసార్లు ఆయనతో సినిమా చేయాలని ట్రై చేశాను కానీ రకరకాల కారణాలతో కుదరలేదు. రామ్ లో మంచి లక్షణం ఏంటంటే.. కథ చెబుతున్నప్పుడు ఒక ఆడియన్ లా వింటాడు. హీరోకి కథ చెప్తున్నామనే ఫీలింగ్ ఉండదు'' అని అన్నారు.

''నేను ఒకసారి రామ్ కు ఒక సెన్సిటివ్ లవ్ స్టోరీ చెప్పా. అందులో ఇద్దరు హీరోలు ఉంటారు. కచ్చితంగా అది రామ్ తరహా సినిమా కాదు. అప్పుడు నేనూ డిఫరెంట్ గా ఏదైనా సినిమా చేయాలని అనుకున్నాను. నేను కథ చెప్తున్నప్పుడు రామ్ నాతో ఒక మాట అన్నాడు. అది నేనెప్పటికీ మర్చిపోలేను''

''కథ విన్నాక రామ్ మాట్లాడుతూ 'బ్రో ఈ ఫ్యాన్ రెండులోనో మూడులోనో తిరుగుతుంది. మనం సినిమా చేస్తే ఫ్యాన్ ఐదులో తిరగాలి' అన్నాడు. ఆ డైలాగ్ నాకు బాగా నచ్చింది. కచ్చితంగా రామ్ తో సినిమా ఉంటుంది. అయితే అది ఎప్పుడనేది ఇప్పుడు చెప్పలేను. అతి త్వరలో అతనితో తప్పకుండా సినిమా చేస్తున్నాను. సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ సినిమా గురించి మరింత మాట్లాడతాను''

''రామ్ ఎలక్ట్రిఫయింగ్ ఎనర్జీతో సీన్స్ ని యాక్షన్ ని మ్యాచ్ చేయడమే డైరెక్టర్ కి పెద్ద ఛాలెంజ్. 'ది వారియర్' సినిమాలో పోలీస్ క్యారక్టర్ లో రామ్ ని చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను'' అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు

ఎనర్జిటిక్ హీరో రామ్ మరియు మాస్ డైరెక్టర్ హరీశ్ కలిసి సినిమా చేయనున్నారని చాలా కాలం క్రితమే వార్తలు వచ్చాయి. త్వరలోనే తమ కాంబినేషన్ లో మూవీ ఉంటుందని దర్శకుడు స్వయంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇద్దరి ఎనర్జీ కలిస్తే బాక్సాఫీస్ బద్దలు అవడం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు.

'ది వారియర్' తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ తో హరీశ్ శంకర్ 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా చేయాల్సి ఉంది. మరి దర్శక హీరోల కమిట్ మెంట్స్ పూర్తైన తర్వాత ఈ క్రేజీ కాంబో కలయికలో సినిమా ఉంటుందేమో చూడాలి.