Begin typing your search above and press return to search.

'జర్సీ' కుర్రాడి మూగ మనసులు

By:  Tupaki Desk   |   28 May 2019 6:50 AM GMT
జర్సీ కుర్రాడి మూగ మనసులు
X
1964లో ఏయన్నార్‌.. సావిత్రి.. జమున వంటి స్టార్స్‌ నటించిన 'మూగమనసులు' చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో మూగ మనసులు చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం మూగ మనసులు చిత్రం గుర్తుండి పోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతటి గొప్ప సినిమా టైటిల్‌ తో ఇప్పటికే ఒక సారి సినిమా వచ్చింది. ఆ సినిమాను జనాలు పెద్దగా ఆధరించలేదు. మళ్లీ ఇప్పుడు మరో సారి తెలుగు ప్రేక్షకుల ముందుకు మూగమనసులు చిత్రం రాబోతుంది.

ఈమద్య కాలంలో వరుసగా ఒక మోస్తరు బడ్జెట్‌ చిత్రాలను నిర్మిస్తున్న సితార ఎంటర్‌ టైన్మెంట్స్‌ బ్యానర్‌ లో ఈ కొత్త మూగ మనసులు తెరకెక్కబోతుంది. ఈ చిత్రంతో సౌజన్య అనే లేడీ దర్శకురాలు టాలీవుడ్‌ కు పరిచయం కాబోతున్నారు. ఈమె చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉంటున్నారు. అవకాశాల కోసం ఎంతో మంది యంగ్‌ హీరోల వద్దకు వెళ్లిన ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు సితార ఎంటర్‌ టైన్మెంట్స్‌ వారు ఈమెకు ఛాన్స్‌ ఇచ్చారు.

ఇక హీరోగా ఈ చిత్రంలో హరీష్‌ కళ్యాణ్‌ నటించబోతున్నాడు. నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన 'జర్సీ' చిత్రంలో గెస్ట్‌ రోల్‌ లో హరీష్‌ కళ్యాణ్‌ కనిపించాడు. నాని కొడుకు పాత్రలో ఇతడు నటించాడు. సినిమా ఆరంభం లో మరియు చివర్లో ఇతడిని చూడవచ్చు. ఎవరూ ఈ కుర్రాడు భలే ఉన్నాడే అని చాలా మంది అనుకున్నారు. ఇతడు తమిళంలో అప్‌ కమింగ్‌ హీరో. అక్కడ ఇప్పుడిప్పుడే హీరోగా రాణిస్తున్నాడు. అతడితో తెలుగులో 'మూగమనసులు' చిత్రం రూపొందించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. మరి టైటిల్‌ కు తగ్గట్లుగా సౌజన్య మ్యాజిక్‌ చేస్తుందా చూడాలి.