Begin typing your search above and press return to search.

స్టేజ్ పై ఆ మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నాను: హరీశ్ శంకర్

By:  Tupaki Desk   |   6 Oct 2021 4:30 AM GMT
స్టేజ్ పై ఆ మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నాను: హరీశ్ శంకర్
X
ఒక సమస్యకు సందేశాన్ని జోడిస్తూ .. దానికి వినోదాన్ని జత చేస్తూ కథను నడిపించడమేంది అంత ఆషామాషీ విషయమేం కాదు. ఆ పనిని సమర్థవంతంగా చేసిన దర్శకుడిగా క్రిష్ ఇప్పుడు ఇండస్ట్రీలో అభినందనలు అందుకుంటున్నాడు. ఆయన దర్శకతకత్వం వహించిన ఆ సినిమానే 'కొండ పొలం'. సాయిబాబు - రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిన్న రాత్రి జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడాడు.

"ఈ సినిమా పోస్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక సినిమా పోస్టర్ పైన నవలా రచయిత పేరు చూసి చాలా కాలమైపోయింది. చాలాకాలం క్రితం యండమూరి గారి నవలలు .. యద్దనపూడి గారి నవలలు .. మల్లాదిగారి నవలలు మేం చదివాము . పోస్టర్లపై చూశాము. ఈ మధ్య కాలంలో నవలలు రాసేవారు తగ్గిపోయారని ఎవరో అన్నారు. ఆ మాటతో నేను ఏకీభవించను .. నవలలు రాసేవాళ్లు కాదు .. చదివేవాళ్లు తగ్గిపోయారు. సోషల్ మీడియాలో అడ్డమైన చెత్త చదవడానికి మనకు టైమ్ ఉంటుంది గానీ .. ఒక మంచి పుస్తకం చదవడానికి మాత్రం మనకి టైమ్ ఉండదు. దీనిని నేను కూడా అతీతుడిని కాదు.

కొన్నేళ్లుగా నేను పుస్తకాల మీద స్పెండ్ చేసిన టైమ్ కంటే సోషల్ మీడియాలో స్పెండ్ చేసిన సమయం ఎక్కువని ఈ స్టేజ్ పై చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. నేను మంచి నవలలు చదివి .. వాటిని సినిమాలుగా తీయాలనే ఇండస్ట్రీకి వచ్చాను .. కానీ కుదరలేదు. 'తానా' వాళ్లు కండక్ట్ చేసిన ఒక కాంపిటేషన్ లో 'కొండ పొలం' ఉత్తమ నవలగా ఎంపిక అయింది. క్రిష్ ఎప్పుడూ కూడా పుస్తకాలను గురించే మాట్లాడుతూ ఉంటాడు. సాహిత్యాన్ని ఎంతగానో ప్రేమించే క్రిష్ ఆ పనిని చాలా సునాయాసంగా చేసేశాడు. ఇందాకే నేను పాటలు విన్నాను .. చాలా బాగా వచ్చాయి.

కరోనా సమయంలో క్రిష్ తాను సినిమా చేస్తున్నట్టు చెబితే నేను ఆశ్చర్యపోయాను. ఈ పరిస్థితుల్లో ఎక్కడ చేస్తున్నావ్ షూటింగ్? అని అడిగితే అందరం ఫారెస్టుకు వెళ్లిపోతున్నాం అని చెప్పాడు. ఈ సమయంలో సినిమా అవసరమా? అంటే, ఈ సమయంలో చాలామందికి పని కావాలి .. ఆ పనిని నేను కల్పిస్తున్నాను అన్నాడు. ఆ మాటలు నాకు చాలా బాగా అనిపించాయి. వైష్ణవ్ ను నేను తేజ్ కి యాక్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్లో చూశాను. తను బాధను దిగమింగుకుంటూ తల్లికి ధైర్యం చెబుతున్నాడు. బంధాన్ని మాత్రమే కాదు బాధ్యతను పంచుకునే తమ్ముడు దొరకడం తేజ్ చేసుకున్న అదృష్టం. ఈ సినిమాలో తను చాలా బాగా చేశాడు.

ఇక ఈ సినిమాలో 'ఓబులమ్మ' పాత్రను చూసిన తరువాత, రకుల్ అనే పేరు మరిచిపోయాను. క్రిష్ ఆ పాత్రను చాలా గొప్పంగా డిజైన్ చేశాడు. ఇందాక విజువల్స్ చూసిన తరువాత నాకు అర్థమైపోయింది. ఈ సారి కూడా అవార్డులన్నీ సంచీలో వేసుకుని వెళ్లిపోవడానికి రెడీగా ఉన్నాడనే విషయం నాకు అర్థమైపోయింది. అవార్డులు కాదు .. డబ్బులు కూడా వస్తాయి. ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. వెంకటరామిరెడ్డిగారు భవిష్యత్తులో మరిన్ని మంచి నవలలు రాయాలి. ఒక నవలను తెరకెక్కించాలనే కోరిక నాకు కూడా ఉంది. అడవిని థియేటర్లకు తీసుకొస్తున్న క్రిష్ ను మరోసారి అభినందిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.