Begin typing your search above and press return to search.

పాకిస్తానీ మావిడాకు బాగోదు -హరీశ్‌ శంకర్

By:  Tupaki Desk   |   3 Jun 2017 4:23 AM GMT
పాకిస్తానీ మావిడాకు బాగోదు -హరీశ్‌ శంకర్
X
అల్లు అర్జున్ మూవీ దువ్వాడ జగన్నాధంలోని 'గుడిలో బడిలో మడిలో' పాటపై వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటలోని కొన్ని పదాలు.. వాక్యాలు బ్రాహ్మణులను అవమానించేలా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. వాటిని మార్చాల్సిందే అంటూ సెన్సార్ బోర్డ్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాయి కొన్ని బ్రాహ్మణ సంఘాలు. దీనిపై స్పందించిన దర్శకుడు హరీష్ శంకర్ సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడు.

ముందుగా ప్రవర చెప్పి పరిచయం చేసుకున్న హరీష్ శంకర్.. 'ఇప్పటికే నేను బ్రాహ్మణ అబ్బాయిని అని మీకు అర్ధమైఉంటుంది. ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగా ఉన్నా కనీసం గుడ్డు కూడా తినని పదహారు అణాల బ్రాహ్మణుడిని నేను. పాటలో అగ్రహారంలో తమలపాకల్లె తాకుతోంది తమకం అనే వాక్యానికి అభ్యంతరం చెబుతున్నారు. ఇందులో తప్పేమీ లేదు. తన ప్రేమను చెప్పేందుకు చుట్టూరా ఉన్న వస్తువులతో పోల్చి చెప్పడం ఆనవాయితీ. ప్రేమలో పడ్డాక పుస్తకం పట్టుకోవాలని అనిపించడం లేదని అన్నంత మాత్రాన సరస్వతీ దేవిని అవమానించినట్లు కాదు. అలాగే తమలపాకు అంటే.. ఒకసారి ఉపయోగించిన ఆకును మరోసారి వాడం. అంత పవిత్రంగా చూసుకుంటాం. అందుకే ఆ పదప్రయోగం చేశాం' అన్నాడు హరీష్ శంకర్. 'మన బ్రాహ్మణుడు తమలపాకు గురించే చెప్పాలి కాని.. పాకిస్తానీ మావిడాకు గురించి చెబితే బాగోదు' అంటూ పంచ్ వేశాడు కూడా.

'సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో స్టూడియో డిస్కషన్స్ కు రాలేకపోతున్నా. అలా రానంత మాత్రాన భయపడ్డట్టు కాదు. ఈ పాట రాసేందుకు సాహితి గారు చాలా కష్టపడ్డారు. తెలుగుదనంతో నిండిన ఈ పాటలో ఎంతో అర్ధం ఉంది. అది అర్ధం కాని ఇలాంటివి అంటారు. దయచేసి అర్ధం చేసుకోండి. లేకపోతే మీకు అర్ధమయ్యేలా చెప్పేందుకు లిరిక్ రైటర్ తో కలిసి నేను వచ్చేందుకు సిద్ధమే. ఇన్ని కోట్లు పోసి వివాదాలు రేకెత్తించాలని అనుకోము. అలాగే నేను తీసిన ఇన్ని సినిమాల్లో ఏ వివాదమూ రాలేదు. నిర్మాతకు కూడా అలాంటి ఉద్దేశ్యం లేదు. తను కట్టించిన వెంకటేశ్వర స్వామి గుడికి ఏటేటా బ్రహ్మోత్సవాలను పవిత్రంగా జరిపిస్తారు దిల్ రాజు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నాపై నేను ఉమ్మేసుకోను కదా.. అర్ధం చేసుకోండి' అంటూ సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడు హరీష్ శంకర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/