Begin typing your search above and press return to search.

వాళ్లకోసమే సినిమా తీస్తే తప్పేం లేదు

By:  Tupaki Desk   |   27 Sep 2015 11:30 AM GMT
వాళ్లకోసమే సినిమా తీస్తే తప్పేం లేదు
X
'మిరపకాయ్‌' - 'గబ్బర్‌ సింగ్‌' వంటి సూపర్‌ హిట్‌ సినిమాల్ని అందించాడు హరీష్‌ శంకర్‌. పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ లు తెరకెక్కించే స్టామినా ఉన్న దర్శకుడిగా పాపులర్‌ అయ్యాడు. ప్రస్తుతం అతడు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ చిత్రాన్ని తెరకెక్కించాడు. సాయిధరమ్‌ తేజ్‌ - రెజీన జంటగా సక్సెస్‌ ఫుల్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు నిర్మించిన ఈ సినిమా ఈనెల 24న రిలీజై విజ‌యం సాధించింది. ఈ సందర్భంగా హ‌రీష్ శంక‌ర్‌ తో ఎక్స్ క్లూసివ్ ఇంట‌ర్యూ....

సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ రెస్పాన్స్‌ ఎలా ఉంది?

ఈ సినిమా రిలీజైన అన్నిచో్ట్లా పెద్ద స‌క్సెస్ సాధించింది. థియేట‌ర్ రెస్పాన్స్ వండ‌ర్‌ ఫుల్‌. పూర్తి స్థాయి ఎంటర్‌ టైనర్‌. నా గత సినిమాల్లానే పూర్తి ఎనర్జీతో ఆక‌ట్టుకుంద‌న్న రిపోర్ట్ వ‌చ్చింది. సినిమాలో స్క్రీన్‌ ప్లే పూర్తిగా కొత్తగా ఉంటుంది. కథ ప్రకారం హీరో ఎన్నారై. మెజారిటీ భాగం సినిమా అమెరికాలోనే తెరకెక్కింది. దిల్‌ రాజు నిర్మాత కాకపోయి ఉంటే నేను ఈ సినిమా చేయలేకపోయేవాడినేమో. ఎందుకంటే నా గత సినిమాలన్నీ ఫ్లాపులు. అందువల్ల ఇంత పెద్ద స్పాన్‌ తో బడ్జెట్‌ పెట్టడానికి ఎవరూ ముందుకు వచ్చేవారే కాదు. రాజుగారి వల్లే ఇది సాధ్యమైంది. అంతే కాదు ఇలాంటివి హిందీలో ఎక్కువగా వస్తాయి. పూర్తిగా అమెరికా బ్యాక్‌ గ్రౌండ్‌ లో ప్రేమకథలు బాలీవుడ్‌ లోనే వచ్చాయి. ఇప్పుడు తెలుగులో సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ పూర్తిగా ఎన్నారై నేపథ్యంలో తెరకెక్కి పెద్ద స‌క్సెసైంది. విజ‌యాన్ని అందించిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు.

సాయిధరమ్‌ నే ఎంచుకోవడానికి కారణం?

సాయిధరమ్‌ లో ఓ పెద్ద స్థాయి కమర్షియల్‌ హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. అందుకే అతడిని ఎంపిక చేసుకున్నా. మిరపకాయ్‌ సినిమా టైమ్‌ లోనే ఈ టైటిల్‌ అనుకున్నా. సుబ్రహ్మణ్యం క్యారెక్టర్‌ కూడా అప్పుడే పుట్టింది. అలాగే ఈ చిత్రానికి సాయిధరమ్‌ ని ఎంపిక చేసుకోవడానికి కారణం రేయ్‌ ట్రైలర్‌. అది చూశాకే ఆ ఎనర్జీ లెవల్స్‌ నా క్యారెక్టర్‌ కి సరిపోతాయనిపించి సాయిధరమ్‌ ని ఎంపిక చేసుకున్నా. ఎన్నారై కథలు రెగ్యులర్‌ గానే వస్తున్నాయి కదా!

మీపై నెగెటివ్‌ కామెంట్స్‌ వినిపిస్తుంటాయి?

గబ్బర్‌ సింగ్‌ తర్వాత నాకు ఎక్స్‌ పోజర్‌ ఎక్కువైంది. అంతకంటే ముందే నేను మిగతావారి కంటే కాస్త హైపర్‌ గానే ఉండేవాడిని. అందరితో హైపర్‌ గా ఉంటా, కాస్త లౌడ్‌ గానే ఉంటా. అయితే చాలా మంది గబ్బర్‌ సింగ్‌ తర్వాత యాటిట్యూడ్‌ వచ్చింది అని అన్నారు. అయితే అందరితో నేనేమంటానంటే.. నా యాటిట్యూడ్‌ వల్లే గబ్బర్‌ సింగ్‌ అవకాశం వచ్చిందని చెబుతుంటా. నేను నాలాగే ఉండడానికి కారణం కూడా ఉంది. నేను బోలెడంత కాంపిటీషన్‌ వరల్డ్‌ నుంచి వచ్చాను. నేను చదువుకున్న బిహెచ్‌ ఇఎల్‌ లో ఐదు ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌ ఉన్నాయి. వాటి మధ్య ఒకే తెలుగు మీడియం స్కూల్‌. అందువల్ల అందరికంటే రేసులో ముందే ఉండాలని అనుకునేవాడిని. పోటీతత్వం ఉండేది నాలో. స్కూల్‌ లో నాటకాలు - స్టేజీ డ్రామాల్లో చురుగ్గా ఉండేవాడిని. పోటీ స్పిరిట్‌ - స్పీడ్‌ నాకు అక్కడ అలవాటు అయినవే. గబ్బర్‌ సింగ్‌ విజయం సాధించాక హాంగోవర్‌ తో తప్పులు చేస్తానేమో అని భయపడ్డా. అందుకే రామయ్యా వస్తావయ్యా సినిమా రాజుగారితో కలిసి చేశాను. కేవలం సక్సెస్‌ వల్ల వచ్చిన హ్యాంగోవర్‌ తో తప్పు చేయకూడదనే దిల్‌ రాజు తో కలిసి ఆ సినిమా చేశాను. ఫైనల్‌ గా ఇద్దరం కలిసి తప్పు చేశామని తేలింది.

పవన్‌ తో ఎటాచ్‌ మెంట్‌ ఎలా?

పవన్‌ కల్యాణ్‌ కి గబ్బర్‌ సింగ్‌ కంటే ముందే మిరపకాయ్‌ కథ చెప్పాను. కథ నచ్చింది. చేద్దామన్నారు. కానీ అదే టైమ్‌ లో దబాంగ్‌ వచ్చి హిట్టయ్యింది ఆ సినిమా రీమేక్‌ చేద్దామని ఆ ఛాన్స్‌ నాకు ఇచ్చారు. అయితే కాస్త సమయం కావాలని అడిగాను. ఛాన్స్‌ రాగానే వెంటనే దూకేద్దాం అని నేను అనలేదు. అది పవన్‌ కి బాగా నచ్చింది. అందుకే నేను ఆయనకి నచ్చాను. సినిమా చేశాం

పవన్‌ తో అభిప్రాయ భేధం వచ్చిందని ప్రచారమైంది?

=గబ్బర్‌ సింగ్‌ టైమ్‌ లో పవన్‌ తో అభిప్రాయ భేధాలొచ్చాయని అనుకున్నారంతా. కానీ అదేమీ నిజం కాదు. ఆయన అభిమానిగా ఆయన్ని విభేధించను. అభిప్రాయ భేధాలు రానేరావు. అయినా నా స్థాయి చాలా చిన్నది. అంత పెద్ద హీరోతో అభిప్రాయ భేధాలు అనేంతటి అర్హత నాకు లేదు. ఒకవేళ విభేధిస్తే నా అసిస్టెంట్ లతో విభేధిస్తాను తప్ప ఆయనతో కాదు. ఆయన శిఖరంపై ఉన్నారు. నేను నేలపై ఉన్నా. ఇప్పుడు చెబుతున్నా.. ఆయన ఫ్యాన్‌ ని నేను. మళ్లీ ఆయనతో అవకాశం ఎప్పుడొస్తుందో తెలీదు. ప్రస్తుతానికైతే వేచి చూస్తున్నా. ఓ కథ రెడీ చేస్తున్నా. గబ్బర్‌ సింగ్‌ 2 కి ఛాన్స్‌ రాలేదనో, ఛాన్స్‌ ఇవ్వలేదనో నేను ఫీలవ్వడం లేదు. ఒక హిట్‌ ఇచ్చినంత మాత్రాన మళ్లీ అవకాశం కావాలని నేను అనుకోలేదు. గబ్బర్‌ సింగ్‌ 2కి దర్శకత్వం వహిస్తున్న బాబి నాకు మంచి స్నేహితుడు. కోన వెంకట్‌ వద్ద పనిచేసేప్పట్నుంచి తను నాకు తెలుసు. పవర్‌ స్టార్‌ తో మొదటి అవకాశం వచ్చినప్పుడు, గబ్బర్‌ సింగ్‌ కి పనిచేసే ఛాన్స్‌ వచ్చినప్పుడు నేను ఎలా ఎగ్జయిట్‌ అయ్యానో, ఇప్పుడు బాబి కూడా అలానే ఎగ్జయిట్‌ మెంట్‌ తో పనిచేస్తుంటాడు. అతడు పెద్ద సక్సెసవ్వాలని కోరుకుంటున్నా. సినిమాలన్నీ హీరో చుట్టూనే తిరుగుతున్నాయ్‌? మూస కథలతోనే కనిపిస్తున్నాయ్‌?

రొటీన్‌ సినిమా తీస్తున్నట్లు అనిపించట్లేదా?

ప్రారంభ దర్శకుడు ఎవరైనా ఇది చేద్దాం.. అది చేద్దాం.. అని అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది. ఇది హీరో బేస్డ్‌ ఇండస్ట్రీ. హీరో కోసమే సినిమా తీయాలి. అయినా హీరోని చూసే జనాలు థియేటర్లకు వచ్చేటప్పుడు, వాళ్ల కోసమే టిక్కెట్టు తెగేప్పుడు వాళ్లకోసమే సినిమా తీస్తే తప్పేం లేదు. అయితే నా సినిమాల్లో ఎక్కువగా కమెడియన్లపై ఆధారపడే సందర్భాలు తక్కువ.

రామయ్యా.. ఫలితం తర్వాత పరిస్థితేంటి?

రామయ్యా వస్తావయ్యా రిలీజైన తర్వాత నా పరిస్థితే వేరు. గబ్బర్‌ సింగ్‌ తర్వాత నెత్తిన పెట్టుకున్నవాళ్లే .. రామయ్యా వస్తావయ్యా వచ్చాక నేలకేసి కొట్టారు. అలాగని నేనెప్పుడు కెరీర్‌ గురించి భయపడలేదు. స్టార్‌ హీరోలతోనే సినిమాలు చేయాలని అనుకోలేదెప్పుడూ. స్టార్‌ హీరోతో పనిచేసినా, సక్సెస్‌ ఉన్న హీరోతో పనిచేసినా బడ్జెట్‌ లు సహకరిస్తాయనే చేయాలనుకున్నా. సక్సెస్‌ ఉన్న హీరోకి కథ చెబితేనే మనకి బడ్జెట్‌ సహకరిస్తుంది. అయితే స్టార్‌ హీరోతో అయినా, చిన్న హీరోతో అయినా కష్టం ఒకటే. గబ్బర్‌ సింగ్‌ హిట్టని, రామయ్యా వస్తావయ్యా ఫ్లాపని నా సినిమాలు జనాలు చూడడం మానేయరు. వాళ్లు తప్పకుండా థియేటర్ లకు వస్తారు. నా సినిమాలు చూస్తారు. రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్‌ అయినా నిర్మాత రాజుగారికి ప్రాఫిట్స్‌ వచ్చాయి. కొన్ని ఏరియాల పంపిణీదారులకు నష్టాలొచ్చాయ్‌ తప్ప అందరూ సేఫ్‌. అలా నష్టపోయిన వారికి 'ఎవడు'తో లాభాల్ని షేర్‌ చేసేశారు. దిల్‌ రాజు కథని నమ్మి అవకాశం ఇచ్చే నిర్మాత. అలానే ఈ అవకాశం వచ్చింది. సాయిధరమ్‌ సినిమా తర్వాత కూడా రాజుగారితో మరో సినిమా ఉంటుంది.

ఎన్టీఆర్‌ తో సినిమా ఎప్పుడు?

ఎన్టీఆర్‌ ఎప్పుడంటే అప్పుడు. అట్నుంచి ఓకే చెప్పాలి. అయితే తనకి ఫ్లాప్‌ ఇచ్చినందుకు చాలా కసిగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో ఓ హిట్‌ సినిమా ఇచ్చి తీరతాను. రామయ్యా వస్తావయ్యా సినిమాలో అసలు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ లేనేలేదు.. అన్నారు కొందరు. అందుకు నేను హర్ట్‌ అయ్యాను. ఆ కసి ఇక నేను తీసే ప్రతి సినిమాలో తీర్చుకుంటా.

బాహుబలి.. మీ అభిప్రాయం?

బాహుబలి విజయం అసాధారణం. రాజమౌళికి హ్యాట్సాఫ్‌. ఈ సినిమా తర్వాత దర్శకుల బాధ్యత పెరిగింది. దేశవిదేశాల్లో అన్నిచోట్లా అందరూ తెలుగు సినిమాలు చూస్తారు కాబట్టి మనం తీసే సినిమాల స్థాయి బావుండాలి. ఇది చాలా పెద్ద బాధ్యత అని ఫీలవుతున్నా. బాహుబలి తీసినందుకు పరిశ్రమలో ఉన్న దర్శకులంతా రాజమౌళికి థాంక్స్‌ చెప్పాం. ఇక ఏ సినిమా చేసినా బాహుబలిని కొట్టేయలేం. కాబట్టి రికార్డుల ఒత్తిడి ఉండనే ఉండదు.

సినిమా తీయడానికి ఇన్‌ స్పిరేషన్‌?

నేను సినిమాలు తీయడానికి చాలా ఇన్‌ స్పిరేషన్స్‌ ఉంటాయి. కొన్ని సంఘటనలు, కొన్ని క్యారెక్టర్లు చూసినప్పుడు ఇన్‌ స్పయిర్‌ అవుతాను. అలాగే బోలెడన్ని చదవడం, సినిమాలు చూడడం చేస్తుంటాం కాబట్టి వాటి ప్రభావం తెలియకుండానే ఉంటుంది.

...అంటూ ముగించారు హరీశ్‌ శంకర్‌