Begin typing your search above and press return to search.

డీజే డైరెక్టర్ తగ్గాడండోయ్!!

By:  Tupaki Desk   |   14 Jun 2017 6:21 PM GMT
డీజే డైరెక్టర్ తగ్గాడండోయ్!!
X
అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాధంపై వివాదం రోజురోజుకూ వేడెక్కుతోంది. ముఖ్యంగా సినిమాలోని ఓ పాట విషయంలో మొదలైన రగడ పెరుగుతూనే ఉంది. 'అస్మైక యోగ' పాట ఉపయోగించిన పదాలు రుద్రస్తోత్రాన్ని అవమానించేలా ఉన్నాయని.. 'అగ్రహారాల తమలపాకల్లె తాకుతోంది తమకం' అన్న వాక్యం బ్రాహ్మణ ఆచారాలను అవమానించి మనోభావాలను కించపరచడమే అన్నది బ్రాహ్మణ సంఘాల వాదన.

ఈ మేరకు వారు మానవ హక్కులు కమిషన్ ను కూడా ఆశ్రయించారు. ఈ పాటలో ఉపయోగించిన పదాలను తొలగించాలని దర్శక నిర్మాతలు కోరినా.. వారు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసింది తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్. దీన్ని విచారించిన హెచ్ఆర్సీ.. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు.. సినిమాటోగ్రఫీ.. ప్రాంతీయ సెన్సార్ బోర్డ్ కమిషన్లను కూడా ఆదేశించింది. ఈ నెల 19లోకి రిపోర్ట్ పంపాలని హెచ్చార్సీ తెలిపింది.

అయితే.. ఈ వివాదంపై మొదట్లోనే స్పందించాడు దర్శకుడు హరీష్ శంకర్. తాను కూడా బ్రాహ్మణుడినే అని చెప్పిన డైరెక్టర్.. ఎటువంటి అభ్యంతరకర పదాలు ఉపయోగించలేదని వాదించాడు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం.. సినిమా రిలీజ్ ఆపేయాలంటూ హెచ్చార్సీకి నివేదించడం వంటి వాటితో.. హరీష్ శంకర్ వెనక్కి తగ్గాడు.

ఈ పాటలో ఉపయోగించిన అభ్యంతరకర పదాలను తొలగించి.. కొత్త లిరిక్ ను మాత్రమే సినిమాలో ఉంచుతామని తెలిపాడు. ఇకపై విడుదల చేసే సీడీలలో.. కొత్త పాట మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నాడు హరీష్ శంకర్. నిజానికి అవసరమైతే అభ్యంతరాలు వెల్లడైన లైన్స్ ను మారుస్తానని ఈ దర్శకుడు ముందే చెప్పాడు.