Begin typing your search above and press return to search.

డైరెక్టరుకి మీడియా వాల్యూ తెలిసిందట

By:  Tupaki Desk   |   26 Sep 2015 1:30 PM GMT
డైరెక్టరుకి మీడియా వాల్యూ తెలిసిందట
X
రామయ్యా వస్తావయ్యా విడుదల సమయంలో ఏం జరిగిందో చాలామందికి గుర్తుండే ఉంటుంది. సినిమాకు ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ మొదలైంది. కానీ డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రం కొన్ని రోజుల తర్వాత కూడా సినిమా ఫ్లాప్ అన్న విషయం ఒప్పుకోలేదు. తన సినిమాను విమర్శించిన వాళ్లపై ఎదురు దాడికి దిగాడు. అసహనం ప్రదర్శించాడు. యూట్యూబ్ లో ‘రామయ్యా వస్తావయ్య’కి భారీగా హిట్స్ వచ్చినపుడు అది చూపించి.. విమర్శకుల్ని ఎద్దేవా చేసే ప్రయత్నం కూడా చేశాడు. కానీ కొంత కాలానికి అతడికి వాస్తవం బోధపడింది. రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ అని.. ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకోలేకపోయానని.. ఆ సినిమా ఫ్లాపవడానికి తనదే బాధ్యత అని నిజాయితీగా ఒప్పుకున్నాడు.

సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’కు హిట్ టాక్ వచ్చింది. సినిమా మీద పాజిటివ్ బజ్ ఉండటంతో మీడియా కూడా ప్రమోషన్ కు సహకరించింది. విడుదల తర్వాత అందరూ పాజిటివ్ రివ్యూలే రాశారు. సినిమా రేంజి పెంచారు. దీంతో హరీష్ కు మీడియా అంటే ఏంటో అర్థమైంది. ఎవ్వరూ కూడా ఉద్దేశపూర్వకంగా ఓ సినిమాను వ్యతిరేక ప్రచారం చేయరు. సినిమా బాలేనపుడు ఆ సంగతి చెప్పి ప్రేక్షకుల్ని అలెర్ట్ చేయడం కూడా మీడియా బాధ్యతే కదా. ఆ సంగతి ఇప్పుడే తనకు అర్థమైందంటున్నాడు హరీష్. ‘‘తొలిసారి నాకు మీడియా వాల్యూ ఏంటో తెలిసింది. సినిమాలో విషయం ఉంటే.. మీడియా కచ్చితంగా దాన్ని బాక్సాఫీస్ దగ్గర మరో లెవెల్ కి తీసుకెళ్తుంది. సుబ్రమణ్యం ఫర్ సేల్ విషయంలో మీడియా మాకెంతో సహకరించింది. ఈ సినిమా సక్సెస్ కావడానికి సహకరించిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు అని చెప్పాడు హరీష్. ఐతే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ హిట్టయింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు హరీష్. మళ్లీ అతడి సినిమా ఏదైనా బాలేకుంటే మీడియాలో నెగెటివ్ ప్రచారమే జరుగుతుంది. అప్పుడు కూడా హరీష్ ఇంతే నిజాయితీగా మాట్లాడాడేమో చూడాలి.