Begin typing your search above and press return to search.

హ‌రీష్ ఇప్పుడు వాడుకొన్నాడా?

By:  Tupaki Desk   |   25 Sep 2015 4:29 AM GMT
హ‌రీష్ ఇప్పుడు వాడుకొన్నాడా?
X
హీరోయిన్ ఇంటికి హీరో రావ‌డం, హీరో త‌న ఇంట్లోకి హీరోయిన్‌ ని తీసుకురావ‌డం... విల‌న్ల‌ని బ‌క‌రాల్ని చేసి త‌న చుట్టూ త‌న ఇంట్లోనే తిప్పుకోవ‌డం, మ‌ధ్య‌లో క‌మెడియ‌న్‌ ని మ‌రో బ‌క‌రాగా చేసి వాడేసుకోవ‌డం... ఇదంతా కూడా తెలుగు సినిమాకి సంబందించినంత వ‌ర‌కు అరిగిపోయిన ఫార్ములా. దాన్ని వెండితెర‌పై చూసి చూసీ బోర్ కొట్టింద‌ని ప్రేక్ష‌కులు - విమ‌ర్శ‌కులు అభిప్రాయ‌ప‌డుతుండ‌టంతో చాలామంది ద‌ర్శ‌కులు ఇక ఆ ఫార్మాట్‌ కి గుడ్ బై చెప్పుదామ‌ని డిసైడ్ అయ్యారు. శ్రీనువైట్ల కూడా మొన్న అదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. తాను కూడా కొత్త ఫార్మాట్‌ లో `బ్రూస్‌లీ` తీశాన‌ని వెల్ల‌డించాడు. అయితే గ‌మ్మ‌త్తుగా హ‌రీష్‌ శంక‌ర్‌ లాంటి ఓ యంగ్ డైరెక్ట‌ర్ ఇప్పుడు మ‌ళ్లీ ఆ ఫార్ములాని అక్క‌డ‌క్క‌డా వాడేసుకొని `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌` తీశాడు.

నిజానికి ఈ ఫార్ములాని ప‌క్కాగా వాడుకొంటే బోలెడంత వినోదం పుడుతుంది. ఆ విష‌యం ఎన్నిసార్లు రుజువైందో లెక్కే లేదు. ఇప్పుడు సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌ తోనూ మ‌రోసారి రుజువైంది. దీన్నిబ‌ట్టి తెలుస్తున్న‌దేంటంటే.. ఎవ‌రేమ‌నుకొన్నా కాసుల వ‌ర్షం కురిపించే ఫార్ములాగా మారింది కాబట్టి దీన్ని తెలుగు ద‌ర్శ‌కులు ఇక‌ముందూ వ‌దిలిపెట్టేలా లేర‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అస‌లే ఫ్లాప్‌ తో ఇబ్బంది ప‌డుతున్న ప‌రిస్థితి కాబ‌ట్టి, ఇచ్చిన అడ్వాన్సులు కూడా తిరిగి తీసుకొన్న ప‌రిస్థితి క‌నిపించింది కాబ‌ట్టి హ‌రీష్‌ శంక‌ర్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌ లోనే `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌` క‌థ రాసుకొని తెర‌కెక్కించాడని చెప్పొచ్చు. మ‌రి ఫామ్‌ లోకి వ‌చ్చాడు కాబట్టి ఇక‌పైనైనా కొత్త త‌ర‌హా ప్ర‌య‌త్నాలు చేస్తాడో లేదంటే ఇదేబాట‌లోనే వెళ్ల‌డం శ్రేయ‌స్క‌రం అనుకొంటాడో చూడాలి. దిల్‌ రాజు మాత్రం ఈ సినిమాతో త‌న మార్కుని కాస్తంత మిస్స‌య్యాడు. ఫ్యామిలీ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల్లో త‌ప్ప త‌న మార్క్ కొత్త‌ద‌నాన్ని దిల్‌ రాజు ఈ సినిమాతో మిస్స‌య్యాడు.